బుమ్రా ఔట్.. ఓ రేంజి ట్రోలింగ్


క్రికెటర్లు గాయపడడం.. కీలక మ్యాచ్‌లకు, టోర్నీలకు దూరం కావడం మామూలే. ఇంకో మూడు వారాల్లో భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్ ఆడబోతుండగా.. టోర్నీలో జట్టుకు అత్యంత కీలకంగా భావిస్తున్న ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయంతో దూరమయ్యాడు. ముందు అతను వెన్నునొప్పి కారణంగా దక్షిణాఫ్రికాతో తొలి టీ20కి దూరం అయినట్లు బీసీసీఐ ప్రకటించింది. దీంతో నొప్పి తాత్కాలికమే అనుకున్నారు. కానీ ఇంకో 24 గంటలు తిరిగేసరికి గాయం తీవ్రత వెల్లడైంది. బుమ్రా టీ20 ప్రపంచకప్‌కు కూడా దూరం కాబోతున్నట్లు సమాచారం బయటికి వచ్చింది. ఇది టీమ్ ఇండియా ప్రపంచకప్ ముంగిట కచ్చితంగా పెద్ద ఎదురు దెబ్బ అనే చెప్పాలి.

ఇప్పటికే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మోకాలి గాయంతో ప్రపంచకప్‌కు దూరం అయ్యాడు. అతను వెళ్లినప్పటి నుంచి జట్టు సమతూకం దెబ్బ తిని భారత్ ఇబ్బంది పడుతోంది. ఇప్పుడు బుమ్రా కూడా దూరం కావడంతో అసలే అంతంతమాత్రంగా కనిపిస్తున్న పేస్ విభాగం మరింత బలహీనపడుతుందనడంలో సందేహం లేదు.

ఐతే బుమ్రా గాయపడి ప్రపంచకప్‌కు దూరమైనందుకు అతడి పట్ల భారత క్రికెట్ అభిమానులేమీ సానుభూతి వ్యక్తం చేయడం లేదు. పైగా గట్టిగా ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. అందుక్కారణం.. బుమ్రా తరచుగా ఇలా గాయపడి అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరం అవుతుండడమే. అదే సమయంలో అతను ఐపీఎల్‌లకు మాత్రం ప్రతిసారీ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటున్నాడు.

బుమ్రా అనే కాదు.. చాలామంది భారత క్రికెటర్లు గాయాల కారణంగా అంతర్జాతీయ మ్యాచ్‌లకు, పెద్ద టోర్నీలకు దూరంగా ఉంటారే తప్ప.. ఐపీఎల్ సమయానికి మాత్రం ఫిట్ అయిపోతారు. చాలామంది పిట్నెస్ సరిగా లేకపోయినా.. ఐపీఎల్ ఆడేస్తుంటారు. ఆ లీగ్ అయిపోయాక మళ్లీ గాయం పేరు చెప్పి అంతర్జాతీయ మ్యాచ్‌లకు డుమ్మా కొడుతుంటారు. ఈ విషయమై దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ సహా చాలామంది గతంలోనే అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కానీ భారత క్రికెటర్ల తీరు మారలేదు. డబ్బు మాయలో పడి భారత క్రికెటర్లు ఐపీఎల్‌కు ఇచ్చే ప్రాధాన్యం అంతర్జాతీయ క్రికెట్‌కు ఇవ్వట్లేదని.. బుమ్రా సైతం ఇదే బాపతు అని.. ఇప్పుడు అతడి పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. వేసవిలో ఐపీఎల్ సమయానికి అతను ఫిట్‌గా మారి అంబానీల కోసం అన్ని మ్యాచ్‌లు ఆడడం ఖాయమని కౌంటర్లు వేస్తున్నారు భారత క్రికెట్ ఫ్యాన్స్.