ప్రపంచ దేశాల్లో విస్తరిస్తోన్న కొత్త వేరియంట్.. ఒమిక్రాన్ బీఏ4.6

ప్రపంచ గమనాన్ని ఒక్కసారిగా మార్చేసిన ఘనత కంటికి కనిపించని కరోనా మహమ్మారిగా చెప్పొచ్చు. ఈ వైరస్ కారణంగా యావత్ ప్రపంచం ఎంతలా ప్రభావితమైందో.. మానవాళి జీవన విధానంలో ఎన్నెన్ని మార్పులు చోటు చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పటికే పలు వేరియంట్లు దండయాత్ర చేయటం.. వాటిని ఎదుర్కొనేందుకు పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఇదంతా ఒక ఎత్తు అయితే తాజాగా ఒక కొత్త వేరియంట్ ప్రపంచ దేశాల్లో విస్తరిస్తోంది.

తాజాగా ఒమిక్రాన్ బీఏ 4.6 కొత్త వేరియంట్ కొత్త టెన్షన్ గా మారింది. యూకే.. అమెరికాలలో ఆగస్టు నెలలో పరీక్షించిన కొవిడ్ నమూనాల్లో ఈ వేరియంట్ కేసులో ఉన్నట్లుగా గుర్తించారు. యూకేలో ఈ వేరియంట్ 3.3 శాతమైతే.. అమెరికాలో 9 శాతానికి పైనే అన్న విషయాన్ని గుర్తించారు. ఈ రెండు దేశాల్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఈ వేరియంట్ విస్తరిస్తున్నట్లుగా పరిశోధనలు చెబుతున్నాయి.

ఈ వేరియంట్ ను తొలిసారి (బీఏ 4) దక్షిణాఫ్రికాలో గుర్తించారు. అప్పటి నుంచి ఈ వేరియంట్ తో రూపాలు మార్చుకోవటం.. బీఏ 5 ప్రపంచంలోని పలు దేశాలకు విస్తరించటం తెలిసిందే. అయితే.. బీఏ4.6 ఏ దేశంలో రూపాంతరం చెందిందన్న విషయంపై మాత్రం ఒక స్పష్టతకు రాలేకపోతున్నారు. వైరస్ వేరియంట్లు ఎప్పటికప్పుడు కొత్త రూపాలకు రూపాంతరం చెందటం తెలిసిందే. కొన్ని వేరియంట్ల కలయికగా కొత్త వేరియంట్లు పుట్టుకు రావటం తెలిసిందే.

ఒకే వ్యక్తికి ఒకేసారి రెండు కరోనా వైరస్ రకాలు సోకితే దాన్ని రీకాంబినెంట్ గా పరిగణిస్తారు. ఆర్ 345టీ మ్యుటేషన్ కు చెందిన ఈ రకం వైరస్ చాలా దేశాల్లో ఇప్పటికే వ్యాప్తి చెంది ఉంది. అయితే.. ఒమిక్రాన్ వేరియంట్ మాదిరే బీఏ4.6 వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ దాని తీవ్రత మాత్రం తక్కువగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. మరణాలు సైతం తక్కువగానే ఉన్నట్లుగా లెక్క వేస్తున్నారు.

బీఏ 5 వేరియంట్ విషయానికి వస్తే రోగ నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునే గుణం ఉన్నట్లుగా నిపుణులు గుర్తించటం తెలిసిందే. తాజాగా బయటకు వచ్చిన బీఏ4.6 వేరియంట్ కు కూడా తప్పించుకునే సామర్థ్యం మరింత ఎక్కువగా ఉన్నట్లు ప్రాథమిక అధ్యయనాలు తేలుస్తున్నాయి. కొత్త వేరియంట్లను చూస్తుంటే.. కరోనా ఇంకా మన మధ్యనే ఉందన్న విషయాన్ని చెబుతున్నట్లుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏమైనా.. కరోనా నుంచి తప్పించుకోవటం సాధ్యం కాదు. అయితే.. దానికి వీలైనంత దూరంగా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవటం మాత్రం పరిష్కార మార్గంగా చెప్పక తప్పదు.