దక్షిణాదిపై డ్రాగన్ ప్రత్యేక నిఘా

డ్రాగన్ దేశం కొత్తం కంపు మొదలుపెట్టింది. ఇండియాలోని దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేకమైన నిఘా ఉంచేందుకు రెడీ అయిపోయింది. తన దేశం నుండి ఏమి చేసుకున్నా ఎవరికీ అభ్యంతరాలు ఉండకపోను. కానీ పొరుగునే ఉన్న శ్రీలంకను తన నిఘాకు అనువుగా మార్చుకుంటోంది. దీనిపైనే కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన అభ్యంతరాలు చెబుతోంది. శ్రీలంకలోని హంబన్ టొట నౌకాశ్రయం నుండి డ్రాగన్ దేశం నిఘా వేసేందుకు ‘యువాన్ వాంగ్ 5’ అనే నిఘా నౌకను పంపింది.

చైనా నుండి బయలుదేరిన యువాన్ వాంగ్ 5 నౌక తొందరలోనే శ్రీలంకలోని హంబన్ టొట నౌకాశ్రయానికి చేరుకుంటుంది. ఒకసారి నౌక గనుక హంబన్ కు చేరుకుంటే మొత్తం దక్షిణ భారత దేశమంతా దాని నిఘా పరిధిలోకి వెళిపోతుంది. ఈనెల 11-17 తేదీల మధ్య ఈ నౌక హంబన్లోనే ఉండబోతోంది. తర్వాత ఏమి అవుతుందనేది ఎవరికీ తెలీదు. యువాన్ ప్రత్యేకత ఏమిటంటే క్షిపణి, అంతరిక్షం, ఉపగ్రహాలను పక్కాగా  ట్రాకింగ్ చేయగలదు. 750 కిలోమీటర్లకు పైగా ఆకాశంలో నిఘా ఉంచగలదు.

అంటే ఈ లెక్కన తమిళనాడులోని కల్పకం, కూడంకుళం అణు పరిశోధనా కేంద్రాలు యువాన్ నిఘాలోకి చేరిపోతాయి. దీంతోపాటు తమిళనాడు, కేరళ, ఆంధప్రదేశ్ లోని ఆరు ముఖ్యమైన పోర్టులపైన కూడా యువాన్ నిరంతరం నిఘా ఉంచగలదు. అలాగే దక్షిణాదిలోని ముఖ్యమైన కేంద్రాలపైన కూడా చైనా నిరంతరం నిఘా ఉంచటం సాధ్యమైవుతుంది. దీనివల్ల మనదేశానికి తీరని నష్టం తప్పదనే కేంద్రప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేసింది.

అయితే మన దేశం ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఉపయోగం ఉండదు. ఎందుకంటే హంబన్ టొట నౌకాశ్రయాన్ని శ్రీలంక అధ్యక్షుడిగా ఉన్నపుడు గొటబాయ రాజపక్స చైనా ప్రభుత్వానికి సుదీర్ఘకాలం లీజుకిచ్చేశారు. రెండుదేశాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఎవరు ఏమీ చేయగలిగేదేమీలేదు. కాకపోతే ఇప్పుడు యువాన్ నిఘా నౌక నుండి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలా అన్న విషయాన్ని కేంద్రప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే భారత్ అభ్యంతరాలను చైనా కొట్టిపడేసింది.