భారతీయ మొబైల్ యూజర్ల ఫేవరెట్ యాప్స్ చాలానే ఒకేసారి బ్యాన్ అయిపోయాయి. చైనాకు ఆదాయం తెచ్చి పెట్టడంతో పాటు మన డేటాను ఆ దేశానికి అందిస్తున్నాయన్న అనుమానాలతో ఒకేసారి 59 చైనా యాప్‌లను నిషేధించింది కేంద్ర ప్రభుత్వం. అందులో భారతీయుల మోస్ట్ ఫేవరెట్ యాప్ టిక్ టాక్ కూడా ఉంది. దీనికి దేశంలో కోట్లాదిమంది బానిసలైపోయారు.
రోజూ టిక్‌టాక్ చూడకుండా, వీడియోలు చేయకుండా నిద్రపట్టని వాళ్లు కోట్లల్లో ఉన్నారు. అలాంటి వాళ్లు టిక్ టాక్ బ్యాన్‌తో ఏమైపోతారో అన్న ఆందోళన ఉంది. ఐతే బాధ పడేవాళ్లు బాధపడుతుండొచ్చు కానీ.. అదే సమయంలో దానికి ప్రత్యామ్నాయంగా ఉన్న భారతీయ యాప్‌ల మీద కూడా కోట్ల మంది దృష్టిసారించారు.
టిక్ టాక్ సహా 59 చైనా యాప్‌లను బ్యాన్ చేస్తున్నట్లు సోమవారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా.. వెంటనే టిక్‌టాక్‌ను పోలిన రొపోసో యాప్ మీద ఇండియన్స్ దండయాత్ర మొదలైంది. ఒక్క రోజు లోపే ఆ యాప్‌కు ఏకంగా కోటి డౌన్ లోడ్లు రావడం విశేషం. ఈ మేరకు ట్విట్టర్లో ఆ సంస్థ ప్రతినిధి ప్రకటన చేశారు.
ఇదొక్కటే కాదు.. మిత్రో, చింగారి, లైక్ లాంటి యాప్స్ కూడా టిక్ టాక్ స్టయిల్లో నడిచేవే. టిక్‌టాక్ స్థాయిలో ఎంటర్టైన్ చేయకపోయినా.. వెంటనే ఆల్టర్నేట్ కోసం చూస్తున్న యూజర్లకు ఇవి కొంత ఉపశమనాన్నందిస్తున్నాయి. రాబోయే రోజుల్లో వీటిని టిక్ టాక్ స్థాయిలో డెవలప్ చేస్తే డౌన్ లోడ్స్ మరింత పెరిగి టిక్ టాక్ స్థాయిలోనే ఆదరణ పొందే అవకాశముంది. ఆ స్థితిలో జనాలు టిక్ టాక్ గురించి రిగ్రెట్ కూడా కారేమో.