ఆ టైల‌ర్ హ‌త్య.. అంత‌ర్జాతీయ కుట్రా? కేంద్రం ఏమందంటే

రాజస్థాన్ లోని ఉద‌య్‌పూర్ ఇద్ద‌రు వ్య‌క్తులు ఓ యువకుడిని అత్యంత కిరాత‌కంగా హ‌త్య చేసిన ఘ‌ట‌న తీవ్ర క‌ల‌క‌లం సృష్టించింది. రాష్ట్రాన్ని అత‌లాకుతలం చేసింది. ఉదయ్‌పుర్‌లోని మల్దాస్ వీధిలో టైల‌ర్ షాపు నిర్వ‌హిస్తున్న క‌న్న‌య్య‌లాల్‌ను ఇద్ద‌రు వ్య‌క్తులు అత్యంత దారుణంగా హ‌త్య చేశారు. వినియోగదారు ల మాదిరిగా వ‌చ్చిన ఇద్ద‌రు వ్య‌క్తుల్లో ఒకరు కన్నయ్యపై కత్తితో దాడి చేయ‌గా, మరో వ్యక్తి ఈ దృశ్యాలను వీడియో తీశాడు. హత్య అనంతరం ఇద్దరూ అక్కడి నుంచి బైక్పై పారిపోయారు.

ఆ తర్వాత కాసేపటికి వీడియోనూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేప‌థ్యంలో వెంట‌నే స్పందించిన పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఇంట‌ర్నెట్ సేవ‌లు నిలిపివేశారు. ఉద‌య్‌పూర్ స‌హా చుట్టుప‌క్క‌ల ఉన్న రెండు మూడు జిల్లాల్లో 8 గంట‌ల పాటు క‌ర్ఫ్యూ విధించారు. ఇక‌, ఈ ఘ‌ట‌నపై ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు. జోధ్‌పూర్ పర్యటనను రద్దు చేసుకుని జైపూర్‌కు తిరిగి వచ్చారు.

ఈ దారుణ హత్య నేపథ్యంలో పోలీసులు ఉదయ్‌పుర్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. దాదాపు ఏడు పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించారు. హత్యను సీరియస్గా తీసుకున్న కేంద్రం.. కేసును ఎన్ఐఏ అప్పగించింది. ఈ హత్య వెనుక అంతర్జాతీయ కుట్ర కోణం ఉంద‌ని కేంద్రం హోం శాఖ పేర్కొంది. ఈ కోణంలోనే ద‌ర్యాప్తు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించింది.

తీవ్ర ఉద్రిక్త‌త‌
టైలర్ కన్హయ్య లాల్ మృతదేహానికి స్థానిక మహారాణా భూపాల్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఆ సమయంలో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజాప్రతిధులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో భాజపా నేత గులాబ్‌చంద్ కటారియా ఎంబీ ఆస్పత్రికి చేరుకొని.. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

కన్హయ్య లాల్ అంత్యక్రియలకు భారీగా ప్రజలు, ప్రజాపతినిధులు హాజరయ్యారు. మృతదేహాన్ని ప్రదర్శనగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా హత్యను ఖండిస్తూ.. బైక్ ర్యాలీ నిర్వహించారు. దోషులను కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు.