సికింద్రాబాద్‌లో ఉద్రిక్త‌త‌లు… రైళ్ల‌కు నిప్పు

కేంద్రం తీసుకొచ్చిన కొత్త సర్వీస్ అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ ఇప్పుడు హైదరాబాద్‌లోనూ నిరసనకారులు గళమెత్తారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ఆందోళనకారులు… రైలుకు నిప్పుపెట్టి నిరసన తెలిపారు. సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరే ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు.

ఒక్కసారిగా యువకులు ఆందోళనకు దిగడంతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పలువురు యువకులకు గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమం ఉన్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బస్సులపై ఆర్మీ ఉద్యోగ‌ అభ్యర్థులు రాళ్లు రువ్వారు. రెండు బోగీలకు నిప్పంటించారు. మొదటి మూడు ఫ్లాట్‌ఫాంలలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఈ మూడు ఫ్లాట్‌ఫాంలను పూర్తిగా ధ్వంసం చేశారు. హౌరా ఎక్స్‌ప్రెస్‌, ఈస్ట్‌ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ సహా మూడు రైళ్లకు ఆందోళనకారులు నిప్పంటించారు. మొత్తానికి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ రణరంగంగా మారింది. అగ్నిపథ్‌ను రద్దు చేసి ఆర్మీ పరీక్షను యథావిధిగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆర్మీ అభ్యర్థులు వేల సంఖ్యలో ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన రైల్వే స్టేషన్‌ వద్దనున్న బస్టాండ్‌కు చేరుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. వెంటనే అక్కడున్న ఆందోళనకారులంతా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పరుగులు తీసి అక్కడ నిలిచి ఉన్న రైళ్లపై విద్యార్థులు రాళ్లు రువ్వుతున్నారు.

దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రయాణికులంతా భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు రైళ్లన్నింటినీ నిలిపివేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఆర్మీ అభ్యర్థులు పట్టాల మధ్యలో నిప్పుపెట్టారు. వేలాది మందిగా ఉన్న యువకులను పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారు. పరిస్థితి పోలీసుల చేయి దాటి పోయింది. రైళ్ల అద్దాలను ధ్వంసం చేస్తుంటడంతో ఏమీ చేయలేక పోలీసులు చూస్తూ ఉండిపోయారు.