ఆర్మీ నియామకానికి సంబంధించిన నూతన విధానం ‘అగ్నిపథ్’పై.. ఉద్యోగార్థులు భగ్గుమన్నారు. ఈ విధానాన్ని వెనక్కి తీసుకోవాలంటూ రోడ్లపైకి వచ్చి భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. బిహార్లో రెండు రైళ్లు తగులబెట్టారు. హరియాణాలోనూ ఆందోళనలు చేపట్టారు. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ సహా పలువురు రాజకీయ నాయకులు ఈ నియామక విధానంపై పెదవి విరిచారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’ పథకంపై పలు ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తమ వుతున్నాయి. స్వల్పకాలానికి జవాన్లను నియమించుకునే విధానంపై ఆర్మీలో చేరాలనుకునే ఆశావహులు.. తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. బిహార్లో వరుసగా రెండోరోజూ వీధుల్లోకి వచ్చి యువకులు ఆందోళన చేశారు. రోడ్డు, రైలు మార్గాలను అడ్డుకున్నారు. పట్నా-గయా, పట్నా-బక్సర్ రహదారులను నిరసనకారులు నిర్బంధించారు.
జెహానాబాద్లో 83వ నంబర్ జాతీయ రహదారిని అడ్డగించారు. రోడ్డుపై టైర్లు తగులబెట్టారు. రాష్ట్రంలోని జెహానాబాద్, ఛాప్ర, నవాదా జిల్లాల్లో నిరసనకారులు ర్యాలీలు నిర్వహించారు. టీఓడీ(టూర్ ఆన్ డ్యూటీ- అగ్నిపథ్)ను రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున యువకులు రైల్వే ట్రాక్లపైకి చేరుకున్నారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్నిచోట్ల నిరసన హింసాత్మకంగా మారింది.
ఛాప్రాలో నిరసనకారులు రెండు రైళ్లకు నిప్పంటించారు. ఛాప్రా జంక్షన్లో ఆగి ఉన్న ప్యాసింజర్ రైలును తగులబెట్టిన యువకులు.. మరో రైలుకు సైతం నిప్పంటించారు. అధికారులు వెంటనే రంగంలోకి దిగి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. పరిస్థితి ఇంకా తీవ్రంగానే ఉందని అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఆందోళనకారులు రాళ్లు రువ్వారు.
“ఇదివరకు చేపట్టిన విధంగానే నియామక ప్రక్రియ కొనసాగించాలి. టూర్ ఆఫ్ డ్యూటీని ఉపసంహరిం చుకోవాలి. గతంలో మాదిరిగానే నియామకం కోసం పరీక్షలు నిర్వహించాలి. కేవలం నాలుగేళ్ల కోసమే ఆర్మీలోకి ఎవరూ వెళ్లరు” అని ముంగేర్లో నిరసన చేస్తున్న ఓ వ్యక్తి పేర్కొన్నాడు.