గ్రేటెస్ట్ ఉమన్ క్రికెటర్.. గుడ్ బై

ఒక్కసారి ఐపీఎల్‌లో అడుగు పెట్టి ఒక్క మ్యాచ్‌లో అదరగొడితే చాలు.. క్రికెటర్ల మీద కోట్లు కురుస్తాయి. ఇక అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటితే ఇక వారి కెరీర్ మామూలుగా ఉండదు. పురుషుల స్థాయిలో కాకపోయినా.. మహిళా క్రికెటర్లకు  కూడా ఇప్పుడు బాగానే ఆదాయం వస్తోంది. వాళ్లు కూడా కోట్లు సంపాదిస్తున్నారు. బీసీసీఐ పరిధిలోకి వచ్చాక వాళ్ల దశ తిరిగిపోయింది.

కానీ ఒక పాతికేళ్ల వెనక్కి వెళ్తే.. మ్యాచ్‌లకు వెళ్లడానికి టీఏ బిల్లులు కూడా సరిగా అందక, మ్యాచ్ ఫీజులు కూడా నామమాత్రంగా ఇస్తూ.. మహిళల క్రికెట్లో కొనసాగాలంటే చేతి నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితులున్న రోజులవి. అలాంటి రోజుల్లో ఆటలోకి అడుగు పెట్టి ఆర్థిక ప్రయోజనాల గురించి ఆలోచించకుండా, భవిష్యత్ గురించి బెంగపడకుండా, వ్యక్తిగత జీవితం, పెళ్లి లాంటి విషయాల గురించి అసలేమాత్రం పట్టించుకోకుండా కేవలం ఆట మీద ప్రేమతో క్రికెట్లో కొనసాగి.. ఎన్నో అద్భుతమైన రికార్డులను సొంతం చేసుకుని భారత క్రికెట్లోనే కాదు.. మొత్తంగా ప్రపంచ మహిళల క్రికెట్లోనే అత్యంత గొప్ప ప్లేయర్లలో ఒకరిగా ఎదిగిన అమ్మాయి మిథాలీ రాజ్.

తెలుగమ్మాయి అని మనందరం గర్వంగా చెప్పుకోదగ్గ ఈ దిగ్గజ క్రికెటర్.. ఎట్టకేలకు తన క్రికెట్ ప్రయాణాన్ని ముగించింది. 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ఆమె బుధవారం తెరదించింది. తాను అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్లు మిథాలీ రాజ్ ప్రకటించింది. పురుషుల క్రికెట్లో సచిన్ టెండూల్కర్ మాదిరే సుదీర్ఘ కాలం అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగి అనేక రికార్డులను ఖాతాలో వేసుకున్న మిథాలీ.. సచిన్ లాగా తాను కూడా ప్రపంచకప్ విజేత అనిపించుకోవాలని తన కెరీర్‌ను పొడిగించుకుంటూ వచ్చింది.

రికార్డు స్థాయిలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆరో ప్రపంచకప్ ఆడింది. కానీ గత ఐదు పర్యాయాల్లాగే ఈసారీ ఆమెకు నిరాశ తప్పలేదు. భారత జట్టు మరోసారి కప్పుకు దూరమైంది. ఇప్పటికే ఆమెకు 39 ఏళ్లు వచ్చేశాయి. కాబట్టి జట్టుకు భారం కాకూడదని, ప్రపంచకప్ కల నెరవేర్చుకోవడానికి ఇంకో నాలుగేళ్లు ఎదురు చూడటం కష్టమని భావించి ఆటకు గుడ్ బై చెప్పేసినట్లుంది మిథాలీ. ఆమె 232 వన్డేల్లో 7805 పరుగులు సాధించింది. భారత్‌ తరఫున మిథాలీ 12 టెస్టులు, 89 టీ20లు కూడా ఆడింది. ఆమె స్వస్థలం హైదరాబాద్.