ఇండియాకు బంపర్ ఆఫర్

ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా మన దేశానికి బంపరాఫర్ అందింది. రష్యా నుండి చమురు, సహజవాయువు కొనుగోలు చేస్తున్న చాలా దేశాలు చమురు కొనుగోలును నిలిపేశాయి. రష్యా నుండి చమురు, సహజ వాయువును దాదాపు 20 దేశాలు కొంటున్నాయి. యుద్ధం కారణంగా ఎందుకు నిలిపేశాయంటే చమురు, సహజవాయువు ద్వారా వచ్చిన నిధులను రష్యా యుద్ధంలో ఖర్చు చేస్తోందట. యుద్ధంలో అన్ని దేశాలు ఉక్రెయిన్ కు మద్దతుగా నిలిచాయి.

అందుకనే రష్యాకు నిధులు అందకుండా చేయాలన్న ఉద్దేశ్యంతోనే హఠాత్తుగా చమురు, సహజవాయువు కొనుగోలును ఆపేశాయి. దాంతో రష్యాకు రెండు రకాల సమస్యలు వచ్చేశాయి. మొదటిది నిధుల సమస్య, రెండోది ఉత్పత్తుల ఎగుమతులు ఆగిపోవటం. ఈ రెండు సమస్యల నుండి వెంటనే బయటపడేందుకు రష్యా వెంటనే భారత్ కు బంపర్ ఆఫర్ ఇచ్చింది. అప్పటివరకు ఇస్తున్న ధర కన్నా సగం ధరకే ఎక్కువ చమురును అమ్ముతానని ఆఫర్ ఇచ్చింది.

ప్రస్తుతం కడుతున్న డబ్బులకే రెట్టింపు సరఫరా చేస్తానని రష్యా అంటే భారత్ ఎందుకు వద్దంటుంది. అందుకనే ఓకే చెప్పేసింది. మే నెలలో రోజుకు రష్యా నుంచి 7.40 లక్షల బ్యారెళ్ళ చమురు ఇండియాకు చేరుకుంది. అంతకుముందు ఏప్రిల్ నెలలో అందిన చమురు రోజుకు 2.84 లక్షల బ్యారెళ్ళు మాత్రమే. అంటే ఏప్రిల్ కన్నా మే నెలలో రెట్టింపు చమురు మనకు అందింది. జూన్ చివరిలో కానీ రష్యా నుండి ఎంత చమురు దిగుమతయ్యిందో తెలీదు.

ఇక్కడో ఇంకో విషయం ఏమిటంటే రష్యాకు మనదేశం చేసే చెల్లింపులన్నింటినీ రూపాయల్లోనే చెల్లిస్తుండటం. గతంలో రష్యా మనకు ఇలాంటి వెసులుబాటు ఇవ్వలేదు. కానీ ఇపుడు తన అవసరాల కోసమని కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు ఒప్పుకుంది. దీనివల్ల అంతర్జాతీయ స్థాయిలో రూపాయి మారకం విలువ పెరిగే అవకాశం వచ్చింది. ఫిబ్రవరి-మే నెలలో 40 మిలియన్ బ్యారెళ్ళ చమురు వచ్చింది. మామూలుగా అయితే రష్యా నుండి మనకు అందే చమురు సుమారు 3 శాతం మాత్రమే. కానీ ఇపుడు ప్రతి నెల 15 శాతం సరఫరా పెరిగిపోయింది. మొత్తానికి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల మనకు తక్కువ ధరకే, కావాల్సినంత చమురు దొరుకుతోంది.