ఆర్యసమాజ్ పెళ్ళిళ్ళు చట్టబద్ధం కాదా

ఒకే ఒక్క తీర్పుతో సుప్రీంకోర్టు లక్షలాదిమంది దంపతులను అయోమయంలో పడేసింది. ఇంతకీ విషయం ఏమిటంటే ఆర్యసమాజ్ లో జరిగే పెళ్ళిలు చట్టబద్దం కావని తీర్పు చెప్పింది. హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తి ఆర్యసమాజ్ లో జరుగుతున్న వివాహాలపై కోర్టులో కేసు వేశారు. ఆ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పై విధంగా తీర్పిచ్చింది. తాజా తీర్పుతో లక్షలాదిమంది దంపతుల బంధం అయోమయంలో పడిపోయింది.

ప్రేమ వివాహాలకు, కులాంతర, మతాంతర వివాహాలకు ఆర్యసమాజ్ కేరాఫ్ అడ్రస్ అన్న విషయం అందరికీ తెలిసిందే. దశాబ్దాలుగా ఆర్యసమాజ్ లో లక్షలమంది వివాహాలు చేసుకుంటారు. ఇక్కడ జరిగే వివాహాలు సంప్రదాయబద్ధంగా జరుగుతాయి. ఆర్యసమాజ్ లో పెళ్ళంటే జనాల్లో కూడా మంచి అభిప్రాయమే ఉంది. వివాహాలు చేయటం ఆర్యసమాజ్ పని కాదని అందుకు ప్రభుత్వ ఆఫీసులున్నాయని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

దీనికి కారణం ఏమిటంటే ఇప్పటివరకు ఆర్యసమాజ్ లో వివాహాలు చేసుకున్న లక్షలాదిమంది దంపతుల దాంపత్యంపై చట్ట సంబంధమైన అనుమానాలు మొదలయ్యాయి. ఇక్కడ వివాహాలు ఆషామాషీగా జరగవు. సంప్రదాయపద్ధతిలో వివాహాలు చేసేటపుడు నిర్వాహకులు పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు కి సంబంధించిన సమస్త వివరాలు తీసుకుంటారు. ఆధార్ కార్డులు, వేలిముద్రలు, కుల ధృవీకరణ, వయసు ధ్రువీకరణ సర్టిఫికేట్లను తీసుకుంటారు. అలాగే సాక్ష్యుల సంతకాలు కూడా తీసుకుంటారు. వీటన్నింటినీ పక్కగా రికార్డు చేస్తారు.

ఆర్యసమాజ్ లో జరిగే పెళ్ళిళ్ళు చట్టబద్ధం కాదని సుప్రీంకోర్టు చెప్పడంపై తీవ్రమైన అభ్యంతరాలు పెరిగిపోతున్నాయి. కారణం ఏమిటంటే ఆర్యసమాజ్ లో జరిగే వివాహాలు చట్టబద్ధం కానపుడు మరి ప్రార్థన స్థలాల్లో, కళ్యాణ మండపాల్లో, ఇళ్ళల్లో జరిగే వివాహాలు ఎలా చెల్లుతాయనే ప్రశ్నలు మొదలయ్యాయి. గుళ్ళు, ప్రార్థనామందిరాలు, ఇళ్ళల్లో జరిగే వివాహం కన్నా ఆర్యసమాజ్ లో జరిగే పెళ్ళిళ్ళు చాలా కట్టుదిట్టంగా జరుగుతాయి. పై ప్రాంతాల్లో జరిగే వివాహాలకు లేని అభ్యంతరాలు ఆర్యసమాజ్ లో వివాహాలకు మాత్రమే ఎందుకు అభ్యంతరాలంటు చాలామంది అడుగుతున్నారు. వివాహాలు చేసుకున్న లక్షలాదిమంది జంటలకు లేని అభ్యంతరాలు సుప్రింకోర్టుకు ఎందుకనే ప్రశ్నలు కూడా మొదలయ్యాయి. మరి ఈ ప్రశ్నలకు సుప్రీంకోర్టు ఏమని సమాధానం చెబుతుందో చూడాలి.