మేరియుపోల్ ను ఆక్రమించుకున్న రష్యా

ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో కీలకమైన పరిణామం చోటు చేసుకున్నది. యుద్ధం ప్రారంభమైన దాదాపు 50 రోజుల తర్వాత రష్యా సైన్యం ఉక్రెయిన్లోని కీలకమైన నగరమైన మేరియుపోల్ ను ఆక్రమించుకున్నది. నగరం తమ స్వాదీనమైందని రష్యా ప్రకటిస్తే లేదు లేదు తమ సైన్యం ఇంకా పోరాడుతోందని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. అయితే క్షేత్రస్ధాయిలో పరిస్ధితులను చూస్తే నగరంలో ఎక్కడచూసినా రష్యా సైన్యమే కనబడుతోంది. దాంతో నగరాన్ని రష్యా సైన్యం ఆక్రమించుకున్నట్లే కనబడుతోంది.

ఉక్రెయిన్ సైన్యం తమకు లొంగిపోతే వాళ్ళందరికీ క్షమాబిక్ష పెడతామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ప్రకటించటం కీలకపరిణామంగా కనిపిస్తోంది. తమకు దొరికిన 1464 మంది ఉక్రెయిన్ సైన్యాన్ని రష్యా సైన్యం మేరియుపోల్ ఉక్కు కర్మాగారంలో బంధించినట్లు సమాచారం. తాజా పరిణామాలతో ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంపై రష్యా పట్టుసాధించటానికి బాగా అవకాశముంది. ఎలాగైనా మేరియుపోల్ ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా చాలా రోజులుగా ఎంతో పోరాటంచేసింది.

ఈ పోరాటంలో వేలాదిమంది సైనికులు చనిపోయినా పట్టువదలకుండా ప్రయత్నించి చివరకు నగరాన్ని స్వాధీనంచేసుకున్నది. ఇదే సమయంలో రష్యా చేతిలోకి వెళ్ళిపోయిన నగరాన్ని తిరిగి స్వాధీనంచేసుకునేందుకు ప్రపంచదేశాలు తమకు ఆయుధాలివ్వాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ విజ్ఞప్తి చేశారు. ఆ నగరంలో చిక్కుకుపోయిన వేలాదిమంది జనాలను రక్షించుకునేందుకు అమెరికా, బ్రిటన్, స్వీడన్ తో చర్చలు జరుపుతున్నారు.

ఈ విషయం ఇలాగుంటే కీవ్, లివివ్, ఖర్కీవ్ తదితర నగరాలపై రష్యా సైన్యం విరుచుకుపడుతోంది. క్షిపణులు, బాంబులతో రష్యా వైమానిక దళాలు విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే రష్యా వైమానికి దాడుల కారణంగా ఉక్రెయిన్లోని చాలా నగరాలు ధ్వంసం అయిపోయాయి. సైనిక శిబిరాలతో పాటు ప్రభుత్వ ఆఫీసులు, ప్రజల ఆవాసాలతో సహా ధ్వంసం అయిపోతున్నాయి. మొత్తానికి యుద్ధం మొదలైన ఇంతకాలానికి మేరియుపోల్ ను రష్యా స్వాధీనం చేసుకోవటం చాలా కీలకమనే చెప్పాలి.