అయోమయంలో వైద్య విద్యార్థులు

ఉక్రెయిన్ నుండి ఇండియాకు తిరిగొచ్చిన వైద్య విద్యార్థుల అయోమయంలో కూరుకుపోతున్నారు. ఉక్రెయిన్ లో మన దేశానికి చెందిన 18 వేల మంది విద్యార్థులు మెడిసిన్ చదువుతున్నారు. యుద్ధం కారణంగా అకస్మాత్తుగా ఈ 18 వేలమంది విద్యార్ధులంతా దేశానికి తిరిగొచ్చేశారు. ఇందులో కనీసం వెయ్యి మంది విద్యార్ధులు ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులున్నారు. తాజా పరిస్ధితులను గమనిస్తుంటే యుద్ధం ఇప్పటిలో ఆగేట్లులేదు.

ఒకవేళ యుద్ధం ఆగినా మళ్ళీ ఉక్రెయిన్ సాధారణ పరిస్ధితులకు రావాలంటే దశాబ్దకాలం పడుతుంది. ఎందుకంటే రష్యా సైన్యం దాడుల కారణంగా చాలా నగరాలు ధ్వంసమైపోయాయి. నగరాలు దాదాపు నేలమట్టమైపోయాయి. అంటే కాలేజీలు, ఆఫీసులు ఇతర భవనాలను పునర్నిర్మించాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఎవరు చెప్పలేరు. కాబట్టి విదేశీ విద్యార్థులు ఎవరు ఉక్రెయిన్ కు వెళ్ళి చదువుకునే అవకాశం ఇప్పట్లో లేదు.

బాధాకరం ఏమిటంటే యుద్ధం మొదలవ్వకపోయుంటే  మరో మూడు నెలల్లో చాలామంది మెడిసిన్ చదవైపోయుండేది. చివరి మూడు నెలల్లో డిగ్రీ చేతికొచ్చేస్తుందనగా యుద్ధం మొదలైంది. దీంతో చివరి పరీక్షలు రాసి డిగ్రీలు తెచ్చుకోవాలంటే  మరి కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సింది. అందుకనే తమను భారత్ లోని వైద్య కళాశాలల్లో మెడిసిన్ కంటిన్యు అయ్యేట్లుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టులో కేసులు వేశారు.

నిజానికి విద్యార్ధుల రిక్వెస్టు పైకి చాలా చిన్నదిగా కనబడుతుంది కానీ లోతుల్లోకి వెళితే చాలా సమస్యలున్నాయి. ఒక్కసారిగా ఇన్ని వేలమంది విద్యార్ధులను చేర్చుకోవడం సాధ్యం కాదు. వీళ్ళ కెపాసిటి ఏమిటో తెలుసుకోకుండా ఉక్రెయిన్ నుండి వచ్చేశారన్న ఏకైక కారణంతో ఏదో ఒక మెడికల్ కాలేజీలో సర్దుబాటు చేయలేరు. ఎందుకంటే వీళ్ళందరు అప్పట్లో రాసిన పరీక్షల్లో ఇక్కడ సీటు రాకపోటంతోనే ఉక్రెయిన్ వెళ్ళి డబ్బులు కట్టి చదువుకున్నారు. పైగా వీళ్ళందరినీ ప్రైవేటు కాలేజీల్లో సర్దుబాటు చేయాలంటే మళ్ళీ డొనేషన్లు కట్టమని అడుగుతారు. కట్టలేకపోతే యాజమాన్యాలు సీటివ్వవు. మరపుడు ప్రభుత్వ కాలేజీల్లో సర్దుబాటు చేస్తారా ? ఇన్ని సమస్యల మధ్య కోర్టు విచారణ ఏ విధంగా జరుగుతుందో చూడాల్సిందే.