రష్యా సైన్యం నుంచి దేశాన్ని రక్షించుకునేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాడు. అమెరికాలోని చట్టసభల సభ్యులతో దాదాపు గంటకుపైగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వీడియోకాల్లో మాట్లాడాడు. ఈ సందర్భంగా జెలెన్ స్కీ మాట్లాడుతూ బహుశా తనను సజీవంగా చూడటం ఇదే చివరిసారి కావచ్చన్నారు. తమపై రష్యా అన్యాయంగా దురాక్రమణకు దిగిందని ఆరోపించారు.
రష్యాను ఎదుర్కొనేందుకు తమకు వెంటనే యుద్ధ విమానాలు, ఆయుధాలు కావాలని కోరారు. రష్యా మీద ఆంక్షలను మరింత కఠినతరం చేయాలన్నారు. అమెరికా చట్టసభ సభ్యులతో మాట్లాడటం ఇదే చివరిసారి కావచ్చన్నారు. దీంతో చట్టసభ సభ్యుల్లో ఉద్వేగం తొంగిచూసింది. జెలెన్ స్కీకి కావాల్సింది కూడా ఇదే. ఎందుకంటే రష్యాపై ఉక్రెయిన్ అధ్యక్షుడు తొడకొట్టింది అమెరికా నేతృత్వంలోని నాటో దేశాల మద్దతు చూసుకునే.
అయితే యుద్ధం మొదలైన తర్వాత అమెరికా, నాటో దేశాలు వెనక్కు తగ్గాయి. యుద్ధం మొదలైన నాలుగోరోజు అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ కొన్ని ఆయుధాలను, డబ్బును సర్దుబాటు చేసింది కానీ ఇంతవరకు తమ దేశాల నుండి సైనికులను మాత్రం పంపలేదు. ఇక్కడే ఉక్రెయిన్ బాగా ఇబ్బందులు పడిపోతోంది. రష్యా రక్షణ బలగం ముందు ఉక్రెయిన్ బలం దాదాపు నామమాత్రమనే చెప్పాలి. ఇపుడు ఉక్రెయిన్ పై రష్యా నామమాత్రపు సైన్యంతోనే 11 రోజులుగా యుద్ధం చేస్తోంది.
రష్యాయే గనుక పూర్తిస్ధాయి సైన్యంతో యుద్ధం చేసుంటే మూడు రోజుల్లోనే ముగిసిపోయుండేది. ఇదే సమయంలో ఉక్రెయిన్ నామరూపాలు లేకుండా పోయుండేదనటంలో సందేహమే లేదు. పరిమిత సైన్యంతో చేస్తున్న యుద్ధంలోనే ఉక్రెయిన్లోని కీలక నగరాలు దాదాపు ధ్వంసం అయిపోయాయి. ఈ నేపధ్యంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు నాటో దేశాల విషయంలో ఒకవైపు తీవ్రమైన అసంతృప్తితోను మరోవైపు నిస్సహాయతతో నలిగిపోతున్నారు. రష్యా దాడులను తట్టుకోలేక నాటో దేశాల బలగాలను తెప్పించుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. అందుకనే సెంటిమెంటు అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు.