ఉక్రెయిన్: ఎంతమంది వలస పోయారో తెలుసా?

ఉక్రెయిన్-రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం చాలా నగరాల్లో బీభత్సాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికి ఏడు రోజులుగా జరుగుతున్న యుద్ధం ఇంకా ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. యుద్ధం నేపథ్యంలో ఏ నగరంపై ఎప్పుడు బాంబులు పడతాయో, క్షిపణలు వచ్చి మీదపడతాయో ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎంత బంకర్లలో దాక్కున్నా ప్రాణభయంతో జనాలు అల్లాడిపోతున్నారు. బంకర్లలో దాక్కున్న వాళ్ళ సమస్య ఏమిటంటే నీళ్ళు, ఆహారం, మందులు అయిపోతున్నాయి. వీటికోసం మళ్ళీ రోడ్ల మీదకు రావాల్సిందే.

అందుకనే ఉక్రెయిన్లోనే ఉండి నిమిషం నిమిషం నరకం అనుభవించే బదులు పొరుగునే ఉన్న దేశాల్లోకి ఏదోరకంగా వలసలు వెళ్ళిపోతే చాలా మళ్ళీ సంగతి మళ్ళీ చూసుకుందాం అని జనాలు అనుకుంటున్నారు. అవకాశాలు ఉన్న వాళ్ళు ఆస్తులు గాలికొదిలేసి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఏదోరకంగా పారిపోతున్నారు. ఈ విధంగా గడచిన ఏడు రోజుల్లో ఉక్రెయిన్ నుండి పొరుగు దేశాలకు సుమారు 10 లక్షలకు పైగా వలసలు వెళ్ళిపోయారు.

పక్కనే ఉన్న పోలండ్ కు అత్యధికంగా 5 లక్షలమంది పారిపోయారు. హంగరీకి 1.20 లక్షలు, మాల్టోవాకు లక్ష మంది, స్లొవేకియాకు 70 వేల మంది, యురోపియన్ యూనియన్ దేశాలకు 88 వేలమంది, బెలారస్ కు 350 మంది పారిపోయారు. చివరకు యుద్ధానికి కారణమైన రష్యాలోకి కూడా సుమారు 47 వేల మంది పారిపోయారు. రొమేనియాలోకి 50 వేల మంది వలస వెళ్ళిపోయారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య తేడా ఏమీలేదు. పూర్వపు సోవియట్ యూనియన్లోని అత్యంత పెద్ద రాష్ట్రాల్లో ఉక్రెయిన్ కూడా ఒకటి.

అందుకనే రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ముందు వరకు జనాల రాకపోకలు హ్యాపీగా జరిగిపోతుండేవి.  ఇపుడు ఉక్రెయిన్లోని జనాలంతా ఒకపుడు సోవియట్ యూనియన్ జనాలే. అందుకనే ఇపుడు ఉక్రెయిన్ నుండి రష్యాలోకి పారిపోయారు. ఇంత తక్కువ సమయంలో ఇన్ని లక్షలమంది ఒక దేశం నుండి ఇతర దేశాలకు వలసలు వెళ్ళిపోవటం ప్రపంచ చరిత్రలోనే ఎప్పుడూ జరగలేదు. గతంలో జరిగిన యుద్ధాల్లో కూడా ఇన్ని లక్షలమంది బయట దేశాలకు వలసలు వెళ్ళిపోలేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వలసలు వెళ్ళిపోవటం నిజంగా బాధాకరమే.