ఉక్రెయిన్‌-ర‌ష్యాల మ‌ధ్య భీక‌ర పోరు త‌ధ్యం

ఇప్ప‌టికే ఐదు రోజులుగా యుద్ధంతో న‌లిగిపోతున్న ఉక్రెయిన్‌కు ఉప‌శ‌మ‌నం ల‌భించ‌లేదు. ర‌ష్యా పోరుకు సై అంటూనే ఉంది. ఈ క్ర‌మంలో  తాజాగా బెలార‌స్ వేదిక‌గా ఇరు దేశాల దౌత్య అధికారుల మ‌ధ్య‌ జ‌రిగిన చ‌ర్చ‌లు విఫ‌ల‌మయ్యాయి. నాటో కూటమిలో చేర‌బోమ‌ని..త‌మ‌కు లిఖిత పూర్వ‌కంగా రాసి ఇవ్వాల‌ని.. ర‌ష్యా ఉక్రెయిన్‌ను ప‌ట్టుబ‌ట్టింది. దీనికి ఉక్రెయిన్ స‌సేమిరా అంది. ఇక‌, అదేస‌మ‌యంలో ర‌ష్యా.. త‌న ద‌ళాల‌ను వెన‌క్కి తీసుకుని, యుద్ధానికి స్వ‌స్తిప‌ల‌కాల‌ని.. ఉక్రెయిన్ ప‌ట్టుబ‌ట్టింది. దీనికి ర‌ష్యా విముఖ‌త వ్య‌క్తం చేసింది. దీంతో ఇరు దేశాల మ‌ధ్య చ‌ర్య‌లు బెడిసి కొట్టాయి. ప‌లితంగా యుద్ధం మ‌రింత తీవ్ర‌త‌రం కానుంద‌ని.. తెలుస్తోంది.

వాస్త‌వానికి.. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం ఆగిపోయే దిశగా మొదటి అడుగు పడింద‌ని అంద‌రూ అనుకున్నారు.  బెలారస్‌ సరిహద్దుల్లోని ఉక్రెయిన్‌ భూభాగంలో ఇరుదేశాల ప్రతినిధులు చర్చలు జరపనున్నార‌ని తెలియ‌డంతో అంద‌రూ సంతోషం వ్య‌క్తం చేశారు. చర్చలకు ముందు రష్యా, ఉక్రెయిన్‌ తమ డిమాండ్లను స్పష్టం చేశాయి. తమ అభ్యంతరాల పరిష్కారంపై ఒప్పందం ఉండాలని రష్యా స్పష్టం చేసింది. దీంతో దాదాపు యుద్ధం తొలిగిపోయింద‌ని అంద‌రూ భావించారు.

ఉక్రెయిన్‌ కూడా రష్యా తక్షణమే ఆయుధాలను వదిలి కాల్పుల విరమణను అమలు చేయాలని తేల్చిచెప్పింది. ఈ చర్చల సందర్భంగా రెండు దేశాలు ఇవే అంశాలను ప్రస్తావించనున్నాయని అంద‌రూ ఊహించిందే జ‌రిగింది. అయిదు రోజులుగా ఉక్రెయిన్‌ బాంబులు, తుపాకుల మోతతో దద్ధరిల్లి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో తాజా చర్చల పురోగతిపై యావత్‌ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూసింది. మ‌రోవైపు యుద్ధాన్ని ఆపడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఒత్తిడి తీసుకురావాలని ఉక్రెయిన్ భాగస్వామ దేశాలకు విజ్ఞప్తి చేసింది.

యుద్ధం కొనసాగుతున్న వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘దాడులు ఆపేసి వెనక్కి వెళ్లిపోయి.. ప్రాణాలు కాపాడుకోవాలి’ అని రష్యా సైనికులను హెచ్చరించారు. ఐరోపా సమాఖ్యలో తమకు వెంటనే సభ్యత్వం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ నేప‌థ్యంలో తాజాగా జ‌రిగిన చ‌ర్చ‌లు విఫ‌లం కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో ర‌ష్యా త‌న చెప్పు చేత‌ల్లోనిబెలార‌స్‌ను రంగంలోకి దించేయ‌గా.. ఉక్రెయిన్‌కూ జ‌పాన్‌, పోలాండ్ వంటి నాటో దేశాలు మ‌ద్ద‌తుగా రంగంలోకి దిగుతున్నాయి. దీంతో యుద్ధం మ‌రింత తీవ్ర‌త‌రం అయ్యే ఛాన్స్ క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.