అణ్వాయుధాల ప్రయోగం తప్పదా?

ఉక్రెయిన్ పై యుద్ధంలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ అణ్యాయుధాల ప్రయోగానికి రెడీ అవుతున్నారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఏ నిముషంలో అయినా యుద్ధరంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉండాలని అణ్వాయుధాలను ప్రయోగించే సైన్యాధికారులను పుతిన్ ఆదేశించారు. పుతిన్ తాజా ఆదేశాలతో యావత్ ప్రపంచం వణికిపోతోంది. తొందరపాటునో లేకపోతే పొరబాటునో రష్యా గనుక అణ్వాయుధాలను ప్రయోగిస్తుందేమో అని అగ్రదేశాలు వణికిపోతున్నాయి.

అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు ఉక్రెయిన్ కు మద్దతుగా రంగంలోకి దిగటాన్ని రష్యా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఉక్రెయిన్ కు జర్మనీ, ఫ్రాన్స్, అమెరికాలు ఆయుధాలు సరఫరా చేయటాన్ని పుతిన్ తప్పుపడుతున్నారు. పైగా వివిధ అవసరాల కోసం ఉక్రెయిన్ కు అమెరికా 600 మిలియన్ డాలర్లు సాయం చేయటాన్ని పుతిన్ తట్టుకోలేకపోతున్నారు. ఏ రూపంలో ఉక్రెయిన్ కు విదేశాలు సాయం చేసినా ఊరుకునేది లేదని పుతిన్ ఇదివరకే వార్నింగ్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే.

అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్ధిక సంస్ధలకు అనుసంధానంగా వ్యవహరించే ‘స్విఫ్ట్’ వ్యవస్ధ రష్యాపై తీవ్రమైన ఆంక్షలను విధించింది. ఈ వ్యవస్ధ అమెరికా ఆధ్వర్యంలో పనిచేస్తుంది. తాజా పరిణామాలతో రష్యాపై తీవ్రమైన ఆర్ధిక ఆంక్షలు మొదలైపోయాయి. ఒకవైపు తమపై ఆర్ధిక ఆంక్షలు అమల్లోకి రావటం, ఇదే సమయంలో ఉక్రెయిన్ కు ఆర్ధికసాయం అందిస్తుండటాన్ని పుతిన్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే సమయంలో రష్యాలో ఉన్న విదేశీ బ్యాంకులన్నింటినీ జాతీయం చేయటానికి పుతిన్ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. దీన్ని విదేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.  ఇందులో భాగంగానే అగ్రరాజ్యంతో పాటు ఇతర దేశాలను హెచ్చరించేందుకు అణ్యాయుధాల హెచ్చరికలు చేసినట్లున్నారు.

సరే పుతిన్ నిర్ణయాలు, ఆదేశాలు ఎలాగున్నా రష్యా సైన్యానికి ఉక్రెయిన్లో చాలా కష్టాలు ఎదురవుతున్నాయి. ఉక్రెయిన్లో ఈస్ధాయి సమస్యలు ఎదురవుతాయని బహుశా పుతిన్ ఊహించుండరు. రష్యా సైన్యానికి వ్యతిరేకంగా ఉక్రెయిన్ సైన్యంకు తోడు మామూలు జనాలు సుమారు లక్షమంది తుపాకులు తీసుకుని రోడ్లపైకి వచ్చేశారు. అలాగే కొన్ని వేలమంది జనాలు సొంతంగా పెట్రోలు బాంబులు ప్రయోగిస్తున్నారు. వీళ్ళు కాకుండా మరికొంతమంది సైనికులు, మామూలు జనాలు ఆత్మాహుతి బాంబర్లుగా మారి రష్యా సైన్యంపై విరుచుకుపడుతున్నారు. మొత్తానికి రష్యాను తీవ్రంగా ఎదిరించి ఉక్రెయిన్ సైన్యం ఆరురోజులుగా యుద్ధం చేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది.