ఆయనేమీ స్వీట్ 16 కాదు. నిజంగా 60 ఏళ్ల వయసున్న వాడు. ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడో తెలుసా? 14 మందిని. అది కూడా ఏడు రాష్ట్రాల్లో. కేవలం పెళ్లి మాత్రమే కాకుండా వారి నుంచి డబ్బులు వసూలు చేసిన ఈ ఘరానా మోసగాడిని తాజాగా అరెస్టు చేశారు. ఒడిశాలోని కేంద్ర పారా జిల్లా పట్కురాకు చెందిన సదరు వ్యక్తి.. పెళ్లి చేసుకొని ఆ తర్వాత పరారైనట్లు తాజాగా వెళ్లడైంది. అంతేకాకుండా వ్యక్తి నిరుద్యోగ యువకులను, రుణాల మోసం తదితర ఆరోపణలపై హైదరాబాద్, ఎర్నాకులంలో రెండుసార్లు అరెస్టు అయ్యాడట.
నిందితుడు మధ్య వయస్కులైన ఒంటరి మహిళలు, ముఖ్యంగా విడాకులు తీసుకున్న వారి గురించి ఎక్కువగా మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో వెతికేవాడని భువనేశ్వర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉమాశంకర్ దాస్ మాట్లాడుతూ.. నిందితుడు 1982లో తొలిసారి పెళ్లి చేసుకున్నాడని, 2002లో రెండో పెళ్లి చేసుకున్నాడని తెలిపారు. రెండు పెళ్లిళ్ల తర్వాత ఐదుగురు పిల్లలు ఉన్నారని పేర్కొన్నారు.
ఆ తర్వాత 2002-2020 వరకు మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ల ద్వారా మహిళలో పరిచయం పెంచుకొని.. ఇద్దరు భార్యలకు తెలియకుండా పలువురు మహిళలను పెళ్లి చేసుకున్నట్లు పేర్కొన్నారు. చివరిసారిగా ఢిల్లీలో స్కూల్ టీచర్‌గా పని చేస్తున్న ఓ మహిళను పెళ్లి చేసుకొని.. భువనేశ్వర్‌లో నివస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆమెకు భర్త గత పెళ్లిళ్ల విషయం తెలియడంతో షాక్ గురైంది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితుడిని అరెస్టు చేశారు.
నిందితుడు పెళ్లి తర్వాత వారి వద్ద నుంచి డబ్బులు తీసుకొని పారిపోయేవాడని పేర్కొన్నారు. నిందితుడి వద్ద నుంచి 11 ఏటీఎం కార్డులు, నాలుగు ఆధార్‌కార్డులు, ఇతర పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్‌గా చెప్పుకొని లాయర్లను, ఫిజిషియన్లు విద్యావంతులైన మహిళలను పెళ్లాడేవాడు. అరెస్టయిన వ్యక్తి ఢిల్లీ, పంజాబ్, అసోం, జార్ఖండ్, ఒడిశా సహా ఏడు రాష్ట్రాలకు చెందిన మహిళలను మోసగించినట్లు పేర్కొన్నారు. మొదట పెళ్లి చేసుకున్న ఇద్దరిని ఒడిశాకు చెందిన వారని వివరించారు. గతేడాది జూలైలో అతని చివరి భార్య ఫిర్యాదు చేయడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయని డీసీపీ తెలిపారు.