యూట్యూబ్‌లోకి వెళ్లి గద్వాల్ బిడ్డ అని టైప్ చేస్తే కుప్పలు కుప్పలుగా వచ్చి పడతాయి వీడియోలు. ఆ కుర్రాడి పేరేంటో తెలియదు కానీ.. తెలుగు మీమ్స్ ఫాలో అయ్యేవాళ్లకు అతను బాగా పరిచయం. అతడి మీద ఎన్ని వందల జోకులు పేలాయో.. ఎన్ని వేల మీమ్స్ వచ్చాయో లెక్కే లేదు. ఇప్పుడా పిల్లాడు హఠాత్తుగా చనిపోవడం అందరినీ విషాదంలో ముంచెత్తింది. ఆస్తమా సమస్యతో బాధ పడుతున్న ఈ పిల్లాడు మరణించిన విషయాన్ని కుటుంబం కూడా ధ్రువీకరించింది.
కొన్నేళ్ల నుంచి తెలుగు మీమ్స్‌ను సుసంపన్నం చేసిన వ్యక్తుల్లో ఇతనొకడు. ఆ పిల్లాడి పేరు.. మల్లికార్జున్ అనే విషయం కూడా చాలామందికి తెలియదు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రెడ్డి వర్గాన్ని కించపరుస్తున్నాడంటూ కొన్నేళ్ల కిందట ఆయన్ని బూతులు తిడుతూ.. అలాగే వేరే ఒక కులాన్ని కించపరుస్తూ ఈ పిల్లాడు రికార్డ్ చేసిన వీడియో అప్పట్లో సంచలనం రేపింది. అతను కించపరిచిన కులస్థులు ఇంటికొచ్చి దాడికి ప్రయత్నించారు.
ఆ సందర్భంలో అతను బిక్కచచ్చిపోయాడు. మంచీ చెడూ తెలియని చిన్నతనంలో ఇంట్లో వాళ్లు నూరిపోసిన కులాహంకారంతో అతనా వీడియో చేసి విమర్శలు ఎదుర్కొన్నాడా పిల్లాడు. ఐతే ఈ వీడియోతో సోషల్ మీడియాలో అతడికి ఎక్కడ లేని పాపులారిటీ వచ్చింది.
మీమ్స్ క్రియేటర్లకు అతను పెద్ద కంటెంట్ అయిపోయాడు. ఒక న్యూస్ ప్రెజెంటర్‌తో ఈ పిల్లాడిని మామూలుగా వాడలేదు మీమ్ క్రియేటర్లు. అతడి పేరు మీద ఎన్ని మీమ్స్ వచ్చాయో లెక్కేలేదు. తన ప్రమేయం లేకుండా అతను ఎంతోమందిని నవ్వించాడు. ఈ పాపులారిటీతో ఒక సినిమాలో కూడా అతను అవకాశం అందుకున్నట్లు సమాచారం. కానీ ఇంతలో ఇలా మరణ వార్త వినాల్సి రావడం అందరినీ విషాదంలోకి నెట్టింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates