వివిధ గుర్తింపు పత్రాలను ఏకతాటిపై తీసుకురావటానికి వీలుగా తొందరలోనే కొత్తగా డిజిటల్ ఐడీని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్ పోర్ట్ లాంటి అనేక కీలక పత్రాలకు ఒకే ఐడీతో అనుసంధానం చేయాలని కేంద్రం తాజాగా డిసైడ్ చేసింది. దీనికి డిజిటల్ ఐడీ రెడీ చేయటమే ఏకైక మార్గమని కూడా కేంద్రం నిర్ణయానికి వచ్చేసింది. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్ ఐటి శాఖ ఒక మోడల్ ను ప్రతిపాదించింది.
కొత్త ప్రతిపాదనలో భాగంగా ఇప్పటివరకు ఆధార్ కార్డు నెంబర్ ఉన్నట్లే కొత్తగా రాబోయే డిజిటల్ ఐడీకి కూడా ఒక విశిష్ట నెంబర్ ఉండచ్చంటున్నారు. ఏ కార్డు అవసరమైతే ఆ కార్డును ఉపయోగించటానికి వీలుగా ఈ నెంబర్ ఉంటుందని సమాచారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఐడీల సమాచారం మొత్తం ఒకే చోట ఉండటానికి వీలుగా కొత్త డిజిటల్ ఐడీ ఉపయోగపడుతుందట. కేవైసీ (నో యువర్ కస్టమర్ లేదా ఈ కేవైసీ తో డిజిటల్ ఐడీని అనుసంధానం చేయటం ద్వారా అనేక సమస్యలకు పరిష్కారమవుతుందట.
ప్రస్తుతం దేశంలోని జనాభాలో ఎక్కువ భాగం అనేక అవసరాలకు అనేక కార్డులను ఉపయోగించుకుంటున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం తరపున అవసరమైన చోట్ల గుర్తింపు కార్డులుగా పాస్ పోర్టు, ఓటర్ ఐడి, ఆధార్ కార్డు, పాన్ కార్డ్ ను ఉపయోగిస్తున్నారు. డిజిటల్ ఐడీ వ్యవస్ధ గనుక అమల్లోకి వస్తే భవిష్యత్తులో అన్నీ అవసరాలకు వివిధ గుర్తింపుకార్డులను ఇచ్చే బదులు ఒక డిజిటల్ ఐడి నెంబర్ ఇస్తే సరిపోతుందట.
ప్రస్తుతం ప్రతిపాదనల దశలోనే ఉన్న ఈ డిజిటల్ ఐడీ వ్యవస్థను అనేక శాఖలు, అనేకమంది నిపుణులు పరిశీలిస్తున్నారు. నిజానికి ఆధార్ కార్డును తీసుకురావాలని అనుకున్నపుడు కూడా అప్పట్లో కేంద్రం ఇదే మాట చెప్పింది. అవసరం ఏదైనా కానీండి ప్రతిదానికీ ఆధార్ కార్డు నెంబర్ ను, జిరాక్స్ కాపీని ఉపయోగిస్తున్నారు. అన్ని అవసరాలకు ఆధార్ కార్డును ఉపయోగిస్తున్నపుడు మళ్ళీ కొత్తగా డిజిటల్ ఐడీ వ్యవస్ధను ఎందుకు తీసుకురాబోతోందో అర్ధం కావటం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates