‘వివో’కు ఐపీఎల్ ‘టాటా’

ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ టోర్నీకి ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. పొట్టి ఫార్మాట్ క్రికెట్ లోకి ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల కన్నా లేటుగా అడుగుపెట్టిన భారత్….ఐపీఎల్ తో లేటెస్ట్ క్రేజ్ ను సంపాదించింది.

ముందొచ్చిన చెవులకంటే వెనుకొచ్చిన కొమ్ములువాడి అన్నట్టుగా బిగ్ బాష్ వంటి టీ20 లీగ్ లకు అందనంత ఎత్తుకు ఐపీఎల్ ఎదిగింది. ఐపీఎల్ సక్సెస్ రేట్ , క్రేజ్….మరే టీ20 క్రికెట్ లీగ్ కు లేవంటే అతిశయోక్తి కాదు. అందుకే, ఐపీఎల్ స్పాన్సర్ గా ఉండేందుకు బడా కార్పొరేట్ కంపెనీలు పోటీ పడుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ ప్రతిష్టాత్మక టోర్నీ స్పాన్సర్ షిప్ ను కార్పొరేట్ దిగ్గజం టాటా సొంతం చేసుకుంది.

తన పాత స్పాన్సర్ వివోకు ఐపీఎల్ టాటా చెప్పేసింది. ఐపీఎల్ 2022 సీజన్ నుంచి టాటా గ్రూప్ స్పాన్సర్ గా వ్యవహరించనుంది. పాత స్పాన్సర్ వివోతో ఐపీఎల్ ఒప్పందం 2021తో ముగిసిపోవడంతో కొత్త స్పాన్సర్ గా టాటా రంగంలోకి దిగింది. లీగ్ కొత్త స్పాన్సర్ గా టాటా గ్రూప్ వ్యవహరించనుందని ఐపీఎల్ చైర్మన్ బ్రజేష్ పటేల్ అధికారికంగా వెల్లడించారు. ఐపీఎల్ పాలకమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

అంతకుముందు, 2018-2022 వరకు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ షిప్ కోసం బీసీసీఐతో చైనీస్ దిగ్గజ కంపెనీ వివో రూ.2,200 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, 2020 సీజన్ సమయంలో భారత్, చైనాల మధ్య సరిహద్దు నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. దీంతో, ఆ ఏడాది వివోను స్పాన్సర్ గా తప్పించారు. మరుసటి సీజన్ లో వివో మళ్లీ స్పాన్సర్ గా కొనసాగింది. అయితే, రాబోయే ఐదేళ్లకుగాను స్పాన్సర్ షిప్ కోసం టాటా ఎంత చెల్లించనుందో తెలియాల్సి ఉంది.