వచ్చే ఫిబ్రవరి నెలలో థర్డ్ వేవ్ ఖాయమని అంటున్నారు. కోవిడ్-19 సూపర్ మోడల్ కమిటీ ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. థర్డ్ వేవ్ ఖాయమే అయినా సెకండ్ వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని కూడా భావిస్తోంది. దేశంలో రోజువారీ కేసుల సంఖ్య సుమారుగా 8 వేల వరకు ఉంటోంది. వీటిల్లో మరణాల సంఖ్య తక్కువే అయినా నూరు శాతం మరణాలైతే ఇంకా కంట్రోల్లోకి రాలేదని కమిటీ హెడ్ డాక్టర్ విద్యాసాగర్ చెప్పారు. మనదేశంలో ఒమిక్రాన్ చాలా స్పీడుగా వ్యాపించే ప్రమాదం కూడా ఉందన్నారు.
మనదేశంలో కోవిడ్ టీకాలు దాదాపు అందరికీ వేయించిన కారణంగానే ఒమిక్రాన్ నుండి రక్షణ దొరికే అవకాశం కూడా ఉందన్నారు. ఇమ్యూనిటీ పెరగడం వల్ల మరణాల శాతం తగ్గే అవకాశాలున్నట్లు విద్యాసాగర్ అభిప్రాయపడ్డారు. ఒకసారి ఒమిక్రాన్ తీవ్రత వల్ల వైరస్ గనుక పాకడం మొదలు పెడితే చాలా స్పీడుగా పాకిపోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. రెండు డోసులు వేసుకున్న వాళ్ళు కూడా వీలైనంతలో బయట తిరగకుండా ఉంటేనే మంచిదని డాక్టర్ స్పష్టంగా చెప్పారు.
కోవిడ్ టీకాలు వేసుకున్నాం కదాని జనాలు నిర్లక్ష్యంగా ఉంటే కరోనా వైరస్ అయినా ఒమిక్రాన్ ను అయినా మనంతట మనమే ఆహ్వానించినట్లవుతుందన్నారు. జనాల నిర్లక్ష్యం వల్లే కరోనా సెకండ్ వేవ్ లో కూడా ఎక్కువ మరణాలు సంభవించినట్లు తెలిపారు. జనాలు తమవైపు నుండి తాము జాగ్రత్తలు తీసుకుంటే రిస్కు శాతం చాలావరకు తగ్గిపోతుందన్నారు. ఒమిక్రాన్ గనుక విజృంభిస్తే రోజువారీ కేసుల సంఖ్యలో పూర్తిగా మారిపోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. 95 దేశాల్లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేసింది.
ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం కూడా ఎంతో అవసరమైతే కానీ జనాలు బయట తిరగద్దని స్పష్టంగా ప్రకటించింది. ఎంతో అవసరమనుకుంటే కానీ ఫంక్షన్లకు, ఊర్లకు, మార్కెట్ల లాంటి పబ్లిక్ ప్లేసుల్లో తిరగద్దని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. మాస్కులు తప్పనిసరిగా ధరించాల్సిందే అని చెప్పింది. ఏమాత్రం అనారోగ్యంగా ఉందనిపించినా వెంటనే డాక్టర్ ను కలిసి అవసరమైన సూచనలు పాటించాలని పదే పదే చెబుతోంది. ఏదేమైనా థర్డ్ వేవ్ లో ఒమిక్రాన్ విజృంబిస్తుందన్న ప్రకటనలే జనాలను భయపెడుతున్నది. చివరకు ఏం జరుగుతుందో చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates