భారత క్రికెట్లో విరాట్ కోహ్లి వైభవానికి తెరపడినట్లే కనిపిస్తోంది. బ్యాట్స్‌మన్‌గా రెండేళ్ల నుంచి అతను స్థాయికి తగ్గ ప్రదర్శన చేయట్లేదు. ఈ రెండేళ్లలో ఏ ఫార్మాట్లోనూ ఒక్క సెంచరీ కూడా సాధించలేదతను. కోహ్లి ఇన్నేళ్ల కెరీర్లో ఇలాంటి ఫామ్ లేమి ఎప్పుడూ లేదు. బ్యాట్స్‌మెన్‌గా ఇరగాడేస్తున్నపుడు కెప్టెన్‌గా అతను ఏం చేసినా చెల్లింది. అతడికి ఎదురే లేకుండా సాగింది.
కానీ బ్యాటింగ్ జోరు తగ్గగానే కెప్టెన్సీ వైఫల్యాలు హైలైట్ అవడం మొదలైంది. మూడు ఫార్మాట్లలో చాలా కాలంగా నాయకత్వం వహిస్తున్నా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవకపోవడం, ఐపీఎల్‌లోనూ ఫెయిలవడంతో అతడి నాయకత్వ లక్షణాలపై ప్రశ్నలు రేకెత్తాయి. ఈ క్రమంలోనే కోహ్లిని తప్పించి రోహిత్‌ను పరిమిత ఓవర్ల క్రికెట్లో కెప్టెన్‌గా చేయాలనే డిమాండ్ మొదలైంది.
ఐతే ఈ డిమాండ్లు పెరుగుతున్న టైంలోనే కోహ్లి తనకు తానుగా టీ20 కెప్టెన్సీ వదిలేశాడు. ఐతే కోహ్లి వ్యూహాత్మకంగానే టీ20 నాయకత్వానికి దూరమయ్యాడన్నది స్పష్టం. తనపై వేటు పడొచ్చనే ఆలోచనతోనే అతను తనకు తానుగా టీ20 కెప్టెన్సీ వదిలేశాడు. దీంతో వన్డే సారథ్యానికి ఢోకా ఉండదనుకున్నాడు. కానీ భారత క్రికెట్లో వన్డేలకు ఒకరు, టీ20లకు ఒకరు అని కెప్టెన్లను పెట్టడం ఎప్పుడూ లేదు.
రెండు ఫార్మాట్లలో ఆడేది దాదాపు ఒకే జట్టు అయినప్పుడు కోహ్లి వన్డేల్లో, రోహిత్ టీ20ల్లో సారథ్యం వహించడం ఇబ్బందికరంగానే ఉంటుంది. కోహ్లి వ్యూహాత్మకంగా టీ20 కెప్టెన్సీ వదిలేసి వన్డేల్లో కొనసాగుదామని, 2023 ప్రపంచకప్‌లోనూ తనే జట్టును నడిపిద్దామని అనుకున్నట్లున్నాడు. కానీ సెలక్టర్లు అతడి పాచిక పారనివ్వలేదు. వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్‌ను తప్పించేశారు. ఇది ఊహించలేని విషయమేమీ కాదు. కోహ్లి ఒకేసారి టీ20లతో పాటు వన్డే సారథ్యం నుంచి తప్పుకుని ఉంటే అతడికి గౌరవంగా ఉండేది. అలా కాకుండా స్ట్రాటజీ ప్లే చేయబోయి ఇప్పుడు సెలక్టర్లు తనపై వేటు వేయడంతో ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates