IND vs NZ మ్యాచ్.. ఎన్ని సిత్రాలో

Ajinkya Rahane (Captain) of India and Kane Williamson captain of New Zealand with Paytm Champions Trophy during day one of the 1st Test match between India and New Zealand held at the Green Park International Stadium in Kanpur on the 25th November 2021 Photo by Saikat Das / Sportzpics for BCCI

టీ20 ప్రపంచకప్‌లో ఘోర వైఫల్యం తాలూకు జ్ఞాపకాలు భారత అభిమానుల మెదళ్లలో మెదులుతుండగానే.. పెద్దగా గ్యాప్ ఇవ్వకుండా న్యూజిలాండ్‌తో సిరీస్ మొదలుపెట్టేసింది టీమ్ ఇండియా. ముందుగా ఆ జట్టుతో మూడు టీ20ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి అభిమానులకు ఊరటనిచ్చింది. ప్రపంచకప్‌లో భారత్‌ను ఓడించడమే కాక.. ఫైనల్ వరకు వెళ్లిన జట్టుతో వెంటనే సిరీస్ ఆడి క్లీన్ స్వీప్ చేయడం గొప్ప విషయమే. అంతటితో ఆగకుండా ఇప్పుడు టెస్టు సిరీస్‌లోనూ జయకేతనం ఎగురవేసింది భారత్.

తొలి టెస్టులో త్రుటిలో విజయాన్ని చేజార్చుకుని, డ్రాతో సరిపెట్టుకున్న భారత్.. రెండో టెస్టులో మాత్రం పట్టు వదల్లేదు. న్యూజిలాండ్‌ను 372 పరుగుల భారీ తేడాతో ఆ జట్టును మట్టి కరిపించింది. 540 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. 167 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 62 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో అనూహ్యమైన విషయాలు చాలానే జరిగాయి. భారత తొలి ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు పడగొట్టి కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ అరుదైన ఘనతను అందుకున్న సంగతి తెలిసిందే.

మన జట్టుపై ప్రత్యర్థి బౌలర్ ఇలాంటి ఘనత సాధించడం కొంచెం ఇబ్బంది పెట్టేదే అయినా.. ఆ రికార్డు అందుకుంది భారత సంతతికి చెందిన వాడే కావడం, తను పుట్టిన ముంబయిలోనే ఈ ఘనత సాధించడం సానుకూల విషయమే. ఇంకో అరుదైన విషయం ఏంటంటే.. ఈ మ్యాచ్‌లో వికెట్లు పడగొట్టిన ప్రతి ఒక్కరూ ఇండియన్సే కావడం విశేషం. భారత జట్టులో ఉన్నవాళ్లందరూ భారతీయులే కాబట్టి ఇక్కడ లెక్కలేమీ చూడాల్సిన పని లేదు. కానీ న్యూజిలాండ్ తరఫున మ్యాచ్‌లో వికెట్లు పడగొట్టిన వాళ్లు కూడా బేసిగ్గా భారతీయులే కావడం విశేషం.

భారత్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్లన్నీ అజాజ్ ఖాతాలో చేరగా.. రెండో ఇన్నింగ్స్‌లో అతను 4 వికెట్లు తీశాడు. భారత్ కోల్పోయిన ఇంకో మూడు వికెట్లు రచిన్ రవీంద్ర తీశాడు. అతను కూడా భారత సంతతికి చెందిన వాడే. ఇంకో విశేషం ఏంటంటే.. అజాజ్ పటేల్‌లోని ‘పటేల్’ అనే పేరు మన జట్టులో అక్షర్ పటేల్‌తో కలుస్తోంది. అలాగే రచిన్ రవీంద్రలోని రవీంద్ర పేరు.. రవీంద్ర జడేజాతో కనెక్షన్ కలిగి ఉంది. ఈ నేపథ్యంలో ఈ నలుగురూ కలిసి వెనుక తమ పేర్లు కనిపించేలా ఫొటోలకు పోజు ఇవ్వగా.. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.