కివీస్ స్పిన్నర్ అజాజ్ ‘దశా’వతారం…ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు

భార‌త్-న్యూజిలాండ్ ల మధ్య జ‌రుగుతోన్న రెండో టెస్టులో కివీస్ స్పిన్నర్ అజాజ్ యూనుస్ ప‌టేల్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసిన మూడో బౌలర్ గా రికార్డులకెక్కాడు. ఇంగ్లండ్‌ కు చెందిన జిమ్ లేకర్ 1956లో ఆస్ట్రేలియాపై 10/53తో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్ గా నిలిచాడు. ఇక, టీమిండియా మాజీ క్రికెటర్, లెజెండరీ స్పిన్నర్ ‘జంబో’ అనిల్ కుంబ్లే 1999లో పాకిస్థాన్‌పై 10/74తో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్ గా చరిత్ర పుటల్లోకెక్కాడు. తాజా ప్రదర్శనతో ఈ ఇద్దరి సరసన అజాజ్ పటేల్ 10/119 చేరాడు.

అజాజ్ దెబ్బకు టీమిండియా 325 పరుగులకు ఆలౌటైంది. అజాజ్ ధాటికి కీలక సమయాల్లో వరుస వికెట్లు కోల్పోయింది. మయాంక్ అగ‌ర్వాల్ 150 ప‌రుగులు చేయగా…శుభ‌మ‌న్ గిల్ 44, చ‌టేశ్వ‌ర్ పూజారా 0, విరాట్ కోహ్లీ 0, శ్రేయాస్ అయ్య‌ర్ 18, వృద్ధిమాన్ సాహా 27, అశ్విన్ 0, అక్ష‌ర్ ప‌టేల్ 52, జ‌యంత్ యాద‌వ్ 12, ఉమేశ్ యాద‌వ్ 0 (నాటౌట్), సిరాజ్ 4 ప‌రుగులు చేసి ఔట‌య్యారు.

మూడేళ్ల క్రితం టెస్టు క్రికెట్ లో అడుగుపెట్టిన అజాజ్ కు ఇది 11వ టెస్టు. ఈ మ్యాచ్‌ ముందు వరకూ 29 వికెట్లు తీసిన అజాజ్…ఒక్క ఇన్నింగ్స్‌లోనే 10 వికెట్లు తీసి సత్తా చాటాడు. 47.5 ఓవర్లు వేసిన అజాజ్ పటేల్ 2.20 ఎకానమీతో 119 పరుగులిచ్చి 10 వికెట్లను పడగొట్టాడు. ఇందులో 12 మెయిడిన్ ఓవర్లు ఉన్నాయి. అజాజ్ ‘దశా’వతారంతో భారత్ భారీ స్కోరు చేయలేకపోయింది. భారత్ గడ్డపై ఓ పర్యాటక జట్టు స్పిన్నర్ నమోదు చేసిన అత్యుత్తమ గణాంకాలు ఇవే కావడం విశేషం.