ఐపీఎల్ ఫ్రాంఛైజీల్లో లోకల్ ఫ్యాన్ బేస్ గురించి పెద్దగా ఆలోచించని జట్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకటి. దీనికంటే ముందు ఉన్న డెక్కన్ ఛార్జర్స్ జట్టుది కూడా అదే తీరు. స్థానిక ఆటగాళ్లకు సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీలో పెద్దగా ప్రాధాన్యం ఉండదు. అలాగే లోకల్‌గా ఒక బ్రాండ్‌ను క్రియేట్ చేసి అభిమానులు జట్టును ఓన్ చేసుకునేలా చేయడంలోనూ సన్‌రైజర్స్ అంతగా విజయవంతం కాలేదు.
ఈ విషయంలో చెన్నై, బెంగళూరు, ముంబయి ఫ్రాంఛైజీలతో పోల్చి చూస్తే సన్‌రైజర్స్ ఎప్పుడూ వెనుకబడే ఉంటుంది. ఒకప్పుడైతే పరిస్థితి మరీ దారుణంగా ఉండేది కానీ.. మధ్యలో డేవిడ్ వార్నర్, రషీద్ ఖాన్ లాంటి ఆటగాళ్లతో ఆ జట్టుకు ఆదరణ పెరిగింది. జట్టు నిలకడగా ఆడటం.. 2016లో కప్పు గెలవడం.. వార్నర్, రషీద్‌లకు తోడు విలియమ్సన్, బెయిర్‌స్టో లాంటి ఆటగాళ్లు కూడా తోడవడంతో సన్‌రైజర్స్‌కు ఆదరణ పెరిగింది.
ఐతే ఈ ఫాలోయింగ్ గత రెండు సీజన్లలో బాగా దెబ్బ తినేసింది. ఇందుకు సన్‌రైజర్స్ ఆటతీరు దెబ్బ తినడం ఒక కారణమైతే.. జట్టుకు బలమైన ఆటగాళ్లు ఒక్కొక్కరుగా దూరమయ్యేలా యాజమాన్యం వ్యవహరించిన తీరు ఇంకో కారణం. ముఖ్యంగా సన్‌రైజర్స్‌కు అతి పెద్ద బలంగా నిలుస్తూ.. తన ఆటతో, వ్యక్తిత్వంతో తెలుగు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్న వార్నర్ విషయంలో సన్‌రైజర్స్ యాజమాన్యం వ్యవహరించిన తీరు దారుణం.
ఈ సీజన్ ప్రథమార్ధంలో జట్టు పేలవ ప్రదర్శన చేయగా.. అందుకు బాధ్యుణ్ని చేస్తూ వార్నర్ మీద వేటు వేశారు. అతను కూడా కొన్ని మ్యాచుల్లో విఫలమైన మాట వాస్తవం. కానీ జట్టు మొత్తం వైఫల్యానికి అతణ్ని బాధ్యుణ్ని చేయడం తప్పు. అతణ్ని కెప్టెన్‌గా తప్పించి, తుది జట్టులో కూడా చోటివ్వకుండా అవమానించారు. ఇప్పుడు అతణ్ని పూర్తిగా జట్టుకు దూరం చేశారు. విలియమ్సన్‌ను అట్టి పెట్టుకుని వార్నర్‌ను వదిలేశారు. ఇదైనా ముందు ఊహించిందే కానీ.. రషీద్ ఖాన్‌ను సన్‌రైజర్స్ దూరం చేసుకుంటుందని ఎవ్వరూ అనుకోలేదు.
వార్నర్ తర్వాత ఆ స్థాయిలో తెలుగు అభిమానులను ఆకట్టుకుని సన్‌రైజర్స్ జట్టులో అంతర్భాగంగా మారాడతను. అతడితో పాటు మరో స్టార్ ఆటగాడు బెయిర్ స్టోను సైతం సన్‌రైజర్స్ దూరం చేసుకుంది. మొత్తంగా ఆ జట్టుకున్న ఆకర్షణంతా ఇప్పుడు పోయినట్లే కనిపిస్తోంది. అభిమానుల నుంచి ఈ విషయంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొన్నేళ్ల పాటు కష్టపడి బిల్డ్ చేసుకున్న ఇమేజ్ అంతా ఇప్పుడు దెబ్బ తినేసింది. మళ్లీ అభిమానుల ఆదరణ సంపాదించడం ఆ జట్టుకు కష్టమే కావచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates