తిరుమల శ్రీవారి దర్శనం.. నియమ నిబంధనలివే

ఈ నెల 8 నుంచి దేశవ్యాప్తంగా ఆలయాలన్నీ తెరుచుకోబోతున్నాయి. దేశంలోనే అత్యంత రద్దీ ఉండే ఆలయం అయిన తిరుమల శ్రీనివాసుడి గుడి కూడా ఇదే రోజు తెరుచుకోబోతంది. సోమవారం నుంచే దర్శనాలు మొదలవుతున్నప్పటికీ.. సాధారణ భక్తులకు దర్శనాలు 11న ఆరంభించనున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.

ఆలయ దర్శనానికి సంబంధించి నియమ నిబంధనలు.. ఇతర మార్గదర్శకాల గురించి ఆయన ప్రెస్ మీట్ పెట్టి వివరించారు. దాని ప్రకారం జూన్ 8, 9 తేదీల్లో టీటీడీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. దీన్ని ప్రయోగాత్మక దశగా భావిస్తున్నారు. ఏమైనా లోటు పాట్లు కనిపిస్తే సరిదిద్దుకుంటారు. 10వ తేదీన తిరుమల, తిరుమలకు చెందిన స్థానికులకు దర్శనం ఉంటుంది. 11న సాధారణ భక్తులకు దర్శనాలు మొదలవుతాయి.

ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7.30 వరకు మాత్రమే దర్శనానికి అనుమతి ఉంటుంది. గంటలకు 500 మందికి మించకుండా దర్శనానికి అనుమతిస్తారు. కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో సాగుతున్న లడ్డూల విక్రయం ఈ నెల 8తోనే ఆగిపోనుంది. రోజూ సుమారు 3 వేల ఆన్‌లైన్‌ టికెట్లు అందుబాటులోకి తెస్తారు.

కంటైన్‌మెంట్‌ జోన్ల నుంచి భక్తులు తిరుమలకు రావొద్దని టీటీడీ స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ ‌చేసుకున్న వారికి అలిపిరిలో పరీక్షలు నిర్వహిస్తారు. 65 ఏళ్లు పైబడిన వాళ్లు, పిల్లలకు అనుమతి లేదు. మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలి. భౌతికదూరం పాటించాలి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 వరకు అలిపిరి నడక దారిలో భక్తులకు అనుమతి ఉంటుంది.

వసతి గదుల్లో రెండో రోజు కొనసాగేందుకు అనుమతి లేదు. క్యూ లైన్లను ప్రతి రెండు గంటలకోసారి శానిటైజ్‌ చేస్తారు. శ్రీవారి ఆలయంలోని ఉప ఆలయాల దర్శనం ఉండదు. వైరస్‌ ప్రబలే ప్రమాదం ఉన్నందున శఠారి, తీర్థం ఇవ్వరు. శ్రీవారి పుష్కరిణిలో స్నానాలకు భక్తులను అనుమతించరు. శ్రీవారి హుండీ వద్దకు వెళ్లే వారు ఆ మార్గంలో ఉండే శానిటైజర్ వాడాలి. భక్తులకు తిరుమలలోని టీటీడీ వసతి గృహాల్లో మాత్రమే బస ఏర్పాట్లుంటాయి. ప్రైవేటు హోటళ్లకు అనుమతి లేదు.