తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ గురవారెడ్డికి ఉన్న పాపులారిటీనే వేరు. సౌత్ ఇండియాలోనే టాప్ మోస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్లలో ఆయనొకరు. కీళ్ల నొప్పులతో అల్లాడిపోయే ఎంతోమందికి ఆయన ఆ నొప్పి నుంచి ఉపశమనాన్నిచ్చారు. వైద్యుడిగానే కాక గొప్ప మానవతావాదిగా కూడా ఆయనకు మంచి పేరుంది. మంచి సాహిత్యాభిరుచి కూడా ఉన్న ఆయన.. జనాలకు ఎప్పుడో ఏదో ఒక మంచి చెప్పే ప్రయత్నం చేస్తుంటారు.
ఆరోగ్య సంబంధిత విషయాలపై అవగాహన పెంచేందుకూ చూస్తుంటారు. కరోనా విజృంభణ మొదలయ్యాక ఆయన.. తాను స్థాపించిన సన్ షైన్ హాస్పిిటల్స్ ద్వారా ఉచితంగా ఫోన్ ద్వారా వైద్యుల సలహాలు పొందే అవకాశం కల్పించారు. కరోనా గురించి ఆయన మొదట్నుంచి జనాల్లో అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నారు.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆయన మరోసారి కరోనా మీద మాట్లాడారు. మాస్క్ ఉపయోగించే విషయంలో ఇప్పటికీ జనాల్లో సరైన అవగాహన రాకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మాస్క్ వాడటం వల్ల ఊపిరి సరిగా అందట్లేదని.. వేరే ఏవో సమస్యలు వస్తున్నాయని ఫిర్యాదులు రావడంపై ఆయన స్పందించారు.
ఇది లక్ష మందిలో ఒక్కరికి ఎదురయ్యే సమస్య అని.. అంతమాత్రాన మాస్కును విస్మరించకూడదని ఆయనన్నారు. గాలి సరిగా ఆడని ప్రదేశాల్లో మాస్క్ ఎక్కువ సమయం పెట్టుకోవడం వల్ల మనం వదిలే కార్బన్ డయాక్సైడ్ తిరిగి మన లోపలికే వెళ్లి సమస్య అవుతుందన్న మాట వాస్తవమే అని.. మన చుట్టూ ఎవరూ లేనపుడు మాస్క్ తీసేయొచ్చని అన్నారాయన.
కానీ మనకు సమీపంలో మనిషి ఉన్నపుడు మాత్రం తప్పక మాస్క్ ధరించాలన్నారాయన. మాస్క్ వేసుకునేది మనల్ని మనం కాపాడుకోవడానికి కాదని.. ఎదుటి వ్యక్తిని కాపాడటానికని.. అది అందరి బాధ్యత అని.. ఎవరైనా నేేను మాస్క్ వేసుకోను అంటే, ఎదుటి వ్యక్తి ప్రాణాలకు అతను విలువ ఇవ్వట్లేదని అర్థమని.. అలాంటి వాళ్లను ఉపేక్షించకూడదని గురవారెడ్డి అన్నారు.
కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తోందన్న ప్రచారంపై ఆయన మాట్లాడుతూ.. వ్యాక్సిన్ అంటే అంత తేలిక కాదని.. వ్యాక్సిన్ కనుక్కున్నాక కూడా ఎన్నో ట్రయల్స్ ఉంటాయని.. పొరబాటున దాని వల్ల ఒక్క ప్రాణం పోయినా వేల కోట్లకు దావా వేస్తారని.. కాబట్టి అన్ని క్లియరెన్స్‌లూ రాకుండా వ్యాక్సిన్ బయటికి రాదని.. వచ్చే మార్చి లోపు వ్యాక్సిన్ వచ్చే అవకాశమే లేదని.. అంత వరకు మాస్క్ వేసుకుంటూ, చేతులు శుభ్రపరుచుకుంటూ, భౌతిక దూరం పాటిస్తూ జనాలు జాగ్రత్తగా ఉండాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates