చైనాలో మళ్లీ కరోనా విలయం

ఫస్ట్ వేవ్‌లో కరోనా తగ్గుముఖం పట్టగానే అందరూ రిలాక్స్ అయిపోయారు. ఇక వైరస్ కథ ముగిసినట్లే అని సాధారణ జీవనం మొదలుపెట్టేశారు. కరోనా పేరెత్తితే కామెడీగా మాట్లాడిన వాళ్లే ఎక్కువ. కానీ అనూహ్యంగా ఈ వేసవిలో కరోనా మళ్లీ విజృంభించింది ఇండియాలో.

తొలి వేవ్‌కు మించి దారుణమైన నష్టం మిగిల్చి జనాలను విపరీతంగా భయపెట్టి ఆ తర్వాత తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు ఇండియాలో కరోనా ప్రభావం చాలా తక్కువగానే కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా గత కొన్ని నెలల్లో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ జరగడం.. ఏకంగా వెయ్యి కోట్ల డోసుల వ్యాక్సిన్లు వేయడం.. అదే సమయంలో జనాల్లో హెర్డ్ ఇమ్యూనిటీ లాంటిది రావడంతో వైరస్ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. అలాగని కరోనా భయం పూర్తిగా పోయిందనుకోవడానికి వీల్లేదని ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది.

చైనా సహా పలు దేశాల్లో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. ముఖ్యంగా కరోనా పుట్టుకకు కారణమైన చైనా మళ్లీ ఫస్ట్ వేవ్ టైంలో మాదిరి భయానక పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు వార్తలొస్తున్నాయి. ఉన్నట్లుండి అక్కడ వైరస్ ప్రభావం పెరిగిపోవడంతో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. అక్కడ స్కూళ్లు, కార్యాలయాలను మూసేశారు. జనాలపై అనేక ఆంక్షలు విధించారు.

బహిరంగ ప్రదేశాల్లో జనాలు తిరగకుండా 144 సెక్షన్ విధించినట్లుగా తెలుస్తోంది. అంతే కాదు. చైనా సరిహద్దులను మూసేశారు. విమాన ప్రయాణాల్ని నిషేధించారు. చైనాలో నియంతృత్వ పాలన ఉండటం వల్ల వాస్తవంగా ఏం జరుగుతోంది.. కరోనా కేసుల లెక్కలు, నష్టం గురించి సరైన సమాచారం బయటికి రాదు కానీ.. అక్కడ ప్రస్తుతం పరిస్థితి అయితే తీవ్రంగానే ఉన్నట్లుగా సంకేతాలు అందుతున్నాయి. చైనాతో ప్రపంచానికి ఉన్న సంబంధాల దృష్ట్యా అక్కడ వైరస్ విజృంభిస్తోందనగానే అందరిలోనూ భయం కలుగుతోంది.