ట్రైన్ ఆలస్యం..రైల్వే శాఖకు షాకిచ్చిన ప్యాసింజర్..!

మనం ఎక్కాల్సిన రైలు అప్పుడప్పుడు రావాల్సిన సమయం కన్నా.. లేటుగా రావడం చాలా మంది అనుభవంలోకి వచ్చే ఉంటుంది. అయితే.. రైలు ఆలస్యమైతే ఏం చేస్తాం..? అది వచ్చే వరకు ఎదురు చూస్తాం. అయితే.. ఓ ప్రయాణికుడు మాత్రం ఊరుకోలేదు. రైలు ఆలస్యంగా రావడం వల్ల తనకు జరిగిన నష్టాన్ని.. వడ్డీతో సహా రాబట్టుకునేలా చేశాడు. ఈ సంఘటన మన దేశంలోనే చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

జ‌మ్మూ కాశ్మీర్‌కు చెందిన సంజ‌య్ శుక్లా కుటుంబం జ‌మ్మూ నుంచి శ్రీన‌గ‌ర్‌కు వెళ్లేందుకు ఫ్లైట్ బుక్ చేసుకుంది. తాముండే ప్రాంతం నుంచి జ‌మ్మూ వెళ్లేందుకు అజ్మీర్, జ‌మ్మూ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో ప్ర‌యాణించారు. అయితే ఉదయం 8.10 గంటలకు జ‌మ్మూ చేరుకోవాల్సిన రైలు కాస్తా.. 4 గంట‌ల ఆల‌స్యంతో మ‌ధ్యాహ్నం 12 గంటలకు వెళ్లింది.

దీంతో సంజ‌య్ కుటుంబం ఫ్లైట్ మిస్ అయ్యింది. అత్య‌వ‌స‌ర‌మైన ప‌ని కావ‌డంతో రూ. 15 వేలు చెల్లించి జ‌మ్మూ నుంచి శ్రీన‌గ‌ర్‌కు వెళ్లారు ఆ కుటుంబ స‌భ్యులు. ఆపై అక్క‌డ బ‌స చేయ‌డానికి రూ. 10 వేలు ఖ‌ర్చు చేయాల్సి వ‌చ్చింది. దీంతో బాధిత కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

కేసు విచార‌ణ సంద‌ర్భంగా బాధిత కుటుంబానికి ఎలాంటి ప‌రిహారం చెల్లించాల్సి అవ‌స‌రం లేద‌ని ప్ర‌భుత్వం వాదించింది. ఇండియ‌న్ రైల్వేస్ చ‌ట్టాల్లోనూ ఆ విష‌యం ఉంద‌ని స్ప‌ష్టం చేసింది. అయితే ప్ర‌భుత్వ వాద‌న‌ల‌ను సుప్రీంకోర్టు త‌ప్పుబ‌ట్టింది. చేసిందే త‌ప్పు.. ఆపై చ‌ట్టాల పేరుతో క‌ప్పిపుచ్చుకోవ‌డానికి ఎందుకు ప్ర‌య‌త్నిస్తున్నారంటూ మంద‌లించింది. ఘ‌ట‌న జ‌రిగిన నాటి నుంచి లెక్కిస్తూ.. బాధిత కుటుంబానికి రూ. 30 వేల ప‌రిహారాన్ని వ‌డ్డీతో చెల్లించాల‌ని ఆదేశించింది. రైళ్ల‌ను ఆల‌స్యంగా న‌డిపిస్తే.. ప్రైవేట్ ఆప‌రేట‌ర్ల‌తో ఎలా పోటీప‌డ‌తార‌ని కూడా సుప్రీంకోర్టు ఈ సంద‌ర్భంగా ప్ర‌శ్నించింది.