ధావ‌న్ ఆమె నుంచి విడిపోయాడు


పెళ్ల‌యి ఇద్ద‌రు పిల్ల‌లున్న మ‌హిళ‌ను పెళ్లాడి తొమ్మిదేళ్ల‌ కింద‌ట ఆశ్చ‌ర్య‌ప‌రిచిన టీమ్ ఇండియా స్టార్ క్రికెట‌ర్ శిఖ‌ర్ ధావ‌న్.. ఆమెతో చాలా అన్యోన్యంగా ఉన్నాడనుకుంటున్న స‌మ‌యంలో త‌న నుంచి విడాకులు తీసుకున్నాడన్న వార్త చ‌ర్చ‌నీయాంశంగా మారింది. భార‌త సంత‌తికి చెందిన ఆస్ట్రేలియా మ‌హిళ అయిన ఆయేషా ముఖ‌ర్జీని 2012లో పెళ్లాడాడు. అప్ప‌టికి ధావ‌న్ వ‌య‌సు 26 ఏళ్లు కాగా.. ఆయేషాకు 37 సంవ‌త్స‌రాలు. ఒక‌ప్ప‌టి బాక్స‌ర్ అయిన ఆయేషాకు అప్ప‌టికే పెళ్ల‌యింది. ఆమెకు ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు.

అయినా స‌రే.. ఆమెతో ప్రేమ‌లో ప‌డి పెళ్లి చేసుకున్నాడు ధావ‌న్. త‌ర్వాత వీళ్లిద్ద‌రికీ ఒక బాబు పుట్టాడు. ధావ‌న్ ఎక్క‌డ క్రికెట్ ఆడినా అక్క‌డ ఆయేషా పిల్ల‌ల‌తో స‌హా ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంటుంది. ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ధావ‌న్ భార్య, పిల్ల‌లు ఎన్నోసార్లు సంద‌డి చేశారు. ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు.

ఆయేషాతో పెళ్లి త‌ర్వాత‌ ధావ‌న్ ప‌క్కా ఫ్యామిలీ మ్యాన్ లాగా మారిపోయాడు. భార్యా పిల్ల‌ల‌తో అనేక‌సార్లు విహార యాత్ర‌ల‌కు వెళ్లి ఆ ఫోటోలూ సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. ఎంతో సాఫీగా సాగిపోతున్న‌ట్లు క‌నిపించిన వీరి వైవాహిక జీవితంలో ఎందుకు విభేదాలు వ‌చ్చాయో తెలియ‌దు కానీ.. వీరి విడాకులు వార్త అంద‌రికీ పెద్ద షాక్ ఇచ్చింది. ఆల్రెడీ వీళ్లిద్ద‌రూ విడి విడిగా ఉంటున్నార‌ని.. విడాకుల ప్ర‌క్రియ కూడా పూర్తయింద‌ని అంటున్నారు.

ఐతే దీని గురించి ధావ‌న్, ఆయేషాల నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. చివ‌ర‌గా ధావ‌న్ శ్రీలంక ప‌ర్య‌ట‌న‌లో క‌నిపించాడు. అత‌డి నాయ‌క‌త్వంలోనే భార‌త రెండో జ‌ట్టు లంక‌లో ప‌ర్య‌టించింది. ఏడాదిన్న‌ర‌గా క‌రోనా కార‌ణంగా క్రికెట‌ర్ల వెంట భార్యా పిల్ల‌లు వెళ్ల‌డం త‌గ్గిపోవ‌డం ధావ‌న్ త‌న భార్య‌కు దూరంగా ఉంటున్న సంగ‌తి బ‌య‌టికి వెల్ల‌డి కాలేదు.