టోక్యో ఒలంపిక్స్ లో మరోసారి మన తెలుగు తేజం పీవీ సింధు అదరగొట్టింది. ఆమె కాంస్యం గెలవడంతో.. ఆమె క్రేజ్ మళ్లీ పెరిగిపోయింది. ఈ క్రేజ్ ని వాడుకోవడానికి కొన్ని బ్రాండ్ సంస్థలు తహతహలాడుతున్నాయి. ఈ క్రమంలో దాదాపు 20 పైగా బ్రాండ్ లు… అనుమతి లేకుండా పీవీ సింధు ఫోటోని వాడుకున్నాయి. దీంతో.. వారికి నోటీసులు జారీ చేశారు.
అధికారికంగా… IOC భాగస్వాములైన బ్రాండ్లు మాత్రమే ఈ ఫొటోలను ఉపయోగించడానికి అనుమతి ఉంటుంది. కానీ.. పలు బ్రాండ్లు ఒలింపిక్స్ మార్గదర్శకాలను కూడా ఉల్లంఘించాయని, టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన సింధు ఇమేజ్‌ని వాడుకున్నాయని బేస్ లైన్ వెంచర్స్ ఆరోపించింది.
నిబంధనలను ఉల్లంఘించిన ప్రతి బ్రాండ్ 5 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాల్సిందిగా ఆయా బ్రాండ్లకు లీగల్ నోటీసులను పంపింది. హ్యాపీడెంట్, పాన్ బహార్, యురేకా ఫోర్బ్స్, ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, వొడాఫోన్ ఐడియా, MG మోటార్, UCO బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, సహా బ్రాండ్లకు నోటీసులను పంపింది.
ఇక ఫినో పేమెంట్స్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, విప్రో లైటింగ్, మరికొన్ని బ్రాండ్లకు నోటీసులు పంపనున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన పోస్ట్‌లను వారి సోషల్ మీడియా హ్యాండిల్స్ నుండి తొలగించాలని అధికారులు డిమాండ్ చేశారు.