అప్పులు ఎగ్గొట్టడంలో ప్రముఖ పారిశ్రామికవేత్త విజయామాల్య ప్లానే వర్కవుటైనట్లుంది. దేశంలోని వివిధ బ్యాంకుల్లో సుమారు రు. 9500 కోట్లు అప్పులు తీసుకున్నారు. వాటిని కట్టకుండా దేశందాటి పారిపోయారు. భారత్ ప్రభుత్వం మాల్యాను ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారుగా ప్రకటించింది. అయితే తాజాగా బ్రిటన్ కోర్టు మాల్యాను దివాలా తీసినట్లు ప్రకటించటం గమనార్హం.
దివాలా తీసినట్లు బ్రిటన్ కోర్టు ప్రకటించటమంటే బ్యాంకుల దగ్గర తీసుకున్న అప్పుల్లో ఒక్క రూపాయి కూడా మాల్యా కట్టాల్సిన అవసరం లేదు. అప్పులకోసం మాల్యా బ్యాంకుల్లో తనఖా పెట్టిన ఆస్తులను బ్యాంకులు అమ్ముకుని తమ అప్పులను రాబట్టుకోవాల్సుంటుంది. అయితే తీసుకున్న అప్పులకు ఆస్తులమ్మి జమచేసుకోవాల్సిన అప్పులకు ఏమాత్రం పొంతనుండదు.
తీసుకున్న అప్పులేమో వేల కోట్ల రూపాయలు. ఆస్తులను అమ్మితే వచ్చేదేమో వందల కోట్లు మాత్రమే. మరి ఆస్తులమ్మితే వచ్చే వందల కోట్ల రూపాయలతో తీసుకున్న అప్పు వేల కోట్ల రూపాయలు తీరేదెలా ? ఎలాగంటే అప్పులు తీరదన్న విషయం అందరికీ తెలిసిందే. అప్పులకన్నా తనకు ఆస్తులే ఎక్కువున్నాయని కాబట్టి తనను భారత్ ప్రభుత్వం అరెస్టు చేయకుండా ఉంటే భారత్ కు వచ్చి మొత్తం అప్పులను తీర్చేస్తానని గతంలో మాల్యా ప్రకటించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.
అయితే మాల్యా ప్రకటించిందంతా అబద్ధమేని తర్వాత అర్ధమైంది. ఎందుకంటే కొన్ని ఆస్తులను వేలంపాట ద్వారా అమ్మాలని బ్యాంకులు ప్రయత్నిస్తే కొనుగోలుదారుల నుండి పెద్దగా స్పందనరాలేదు. వివాదంలో ఉన్న ఆస్తులను కొనటానికి చాలామంది ముందుకురారు. ఒకవేళ ఎవరైనా వచ్చినా చాలా తక్కువ ధరలకు కొనాలని మాత్రమే చూస్తారు. అంటే మాల్యా తీసుకున్న అప్పులు ఎప్పటికీ తీరేవికావు.
అందుకనే అప్పుల్లో వచ్చినకాడికి రాబట్టుకుని మాల్యాను జైల్లో పెట్టాలని దర్యాప్తు సంస్ధలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే మాల్యా దివాలా తీసినట్లు బ్రిటన్ కోర్టు ప్రకటించడమంటే మాల్యాకు అనుకూలంగానే తీర్పొచ్చిందని అనుకోవాలి. ఎందుకంటే ఒకసారి దివాలా తీసినట్లు కోర్టే ప్రకటించిందంటే ఇక అప్పులిచ్చిన వాళ్ళు మాల్యా వెంట పడేందుకు లేదు. కాకపోతే బ్రిటన్ కోర్టు మనదేశంలో చెల్లుబాటవుతుందా అన్నదే కీలకం. అయినా మాల్యాకు ఇండియాకు వచ్చే ఉద్దేశ్యం ఉంటేనే కదా.