టీమిండియాలో కరోనా కలకలం..!

టీమిండియాను కరోనా మహమ్మారి కలవరపెడుతోంది. విరాట్ కోహ్లీ నేతృత్వంలో ఇంగ్లండ్ వెళ్లిన టీమిండియా ఆటగాళ్ల‌లో ఒక‌రికి కరోనా సోకిన విష‌యం ఆల‌స్యంగా వెలుగు చూసింది. గొంతునొప్పితో బాధ‌ప‌డుతున్న ఆ ఆట‌గానికి క‌రోనా టెస్ట్ నిర్వ‌హించ‌గా.. పాజిటివ్ అని నిర్ధార‌ణ అయిన‌ట్టుగా స‌మాచారం. దీంతో ఆ ఆట‌గానితో స‌న్నిహితంగా మెలిగిన‌వారిని ఇప్ప‌టికే మూడు రోజుల పాటు ఐసోలేష‌న్‌లో ఉంచిన‌ట్టుగా తెలుస్తోంది.

ప్ర‌స్తుతం ఇంగ్లండ్‌లో డెల్టా వేరియెంట్ డేంజ‌ర‌స్‌గా మారింది. ఈ క్ర‌మంలోనే ముందు జాగ్ర‌త్త‌గా ఆట‌గాళ్ల‌కు క‌రోనా టెస్టులు నిర్వ‌హించ‌గా.. బ‌య‌ట‌ప‌డింది.

బ‌యో బ‌బుల్ నుంచి బయటకు వచ్చిన ఆ ఆట‌గాడు.. ప్ర‌స్తుతం ఇంగ్లండ్‌లోని త‌న స‌న్నిహితుడి ఇంటిలో హోమ్ క్వారంటైన్‌లో ఉన్న‌ట్టుగా చెప్తున్నారు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు భార‌త్ జ‌ట్టు.. ఓ ప్రాక్టిస్ మ్యాచ్ ఆడ‌నుంది. దుర్హమ్‌లో కౌంటీ ఛాంపియన్‌ఫిప్-XI జట్టుతో తలపడనుంది.

ఇటీవల ఇంగ్లండ్ టీంలో కూడా ఏకంగా ఏడుగురిలో క‌రోనా వైర‌స్ బ‌య‌ట‌ప‌డింది. పాకిస్తాన్‌తో వన్డే సిరీస్ స‌మ‌యంలో ఇది చోటు చేసుకుంది. పైగా వారంద‌రిలోనూ డెల్టా వేరియెంట్ క‌రోనానే బ‌య‌ట‌ప‌డింది.