భారత్ లో తొలి కరోనా రోగి కి మళ్లీ ఇన్ఫెక్షన్..!

భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో కొందరు కోవిడ్ విజేతలకు వైరస్‌ మళ్లీ సోకుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. తాజాగా దేశంలో కరోనా వైరస్‌ బారినపడిన తొలి వ్యక్తికి మళ్లీ వైరస్‌ సోకింది. భారత్‌లో కొవిడ్‌-19 సోకిన తొలి వ్యక్తిగా రికార్డుకెక్కిన కేరళకు చెందిన వైద్య విద్యార్ధిని, మరోసారి వైరస్‌ బారినపడినట్లుగా ఆ రాష్ట్ర వైద్య శాఖ అధికారులు వెల్లడించారు.

యాంటీజెన్‌ పరీక్షల్లో నెగటివ్‌ వచ్చినప్పటికీ ఆర్‌టీ-పీసీఆర్‌లో మాత్రం ఆమెకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమెలో ఎలాంటి లక్షణాలు లేవు అని కేరళలోని త్రిస్సూర్‌ జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ కేజే రీనా వెల్లడించారు. ఉన్నత చదువుల కోసం ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఆమె నమూనాలను పరీక్షించగా పాజిటివ్‌గా తేలినట్లు తెలిపారు. ప్రస్తుతం సదరు వైద్య విద్యార్ధిని ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ప్రస్తుతం ఆమె ఇంటిలోనే ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.

డిసెంబర్‌ 2019లో చైనాలో వెలుగు చూసిన కరోనా వైరస్‌.. అనతికాలంలోనే యావత్‌ ప్రపంచానికి విస్తరించింది. భారత్‌లో జనవరి 30, 2020న తొలి కేసు నమోదయ్యింది. వుహాన్‌ యూనివర్సిటీలో చదువుతోన్న కేరళకు చెందిన మెడికల్‌ విద్యార్థిని, సెమిస్టర్‌ సెలవుల్లో భాగంగా భారత్‌కు వచ్చింది. అనంతరం అస్వస్థతకు గురికావడంతో అధికారులు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తద్వారా ఆమె భారత్‌లో కరోనా బారినపడిన తొలి వ్యక్తిగా రికార్డుల్లోకెక్కారు. మూడు వారాలపాటు మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స అందించిన అనంతరం ఆమెను ఫిబ్రవరి 20, 2020న డిశ్చార్జి చేశారు.

కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి కనీసం 102 రోజుల వ్యవధిలో రెండోసారి పాజిటివ్‌‌గా తేలితే దాన్ని రీ-ఇన్‌ఫెక్షన్‌గా పరిగణించాలని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) గతంలోనే మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే ఈ మధ్యకాలంలో ఒకసారి నెగటివ్‌ వచ్చి మళ్లీ పాజిటివ్‌ వస్తేనే దాన్ని రీ-ఇన్‌ఫెక్షన్‌గా గుర్తిస్తారు. అమెరికాలో వ్యాధుల నియంత్రణ, నిర్మూలన కేంద్రం(సీడీసీ) మార్గదర్శకాల ప్రకారం, ఓ వ్యక్తికి 90 రోజుల అనంతరం మళ్లీ పాజిటివ్‌ వస్తే, జీనోమ్‌ సీక్వెన్స్‌ ద్వారా రీ-ఇన్‌ఫెక్షన్‌ను నిర్ధారించాలని చెబుతోంది.