దేశంలో జికా వైరస్ కలకలం.. తొలికేసు నమోదు..!

ఇప్పటికే దేశాన్ని కరోనా మహమ్మారి వదిలిపెట్టడం లేదు. కరోనా లోనూ కొత్త రకం వేరియంట్లు దేశాన్ని అతలాకుతలం చేసేస్తున్నాయి. ఇలాంటి సమయంలో.. దేశంలో జికా వైరస్ కలకలం రేపడం మొదలుపెట్టింది.. తాజాగా.. కేరళ రాష్ట్రంలో తొలి జికా వైరస్ కేసు వెలుగు చూసింది. 24ఏళ్ల మహిళలో ఈ వ్యాధిని గుర్తించినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి చెప్పారు.

తిరువనంతపురంలో మరో 13 అనుమానిత కేసులు ఉన్నాయని.. వాటికి సంబంధించి పూణెలోని జాతీయ వైరాలజీ సంస్థ నుంచి ధ్రువీకరణ కోసం ప్రభుత్వం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

తిరువనంతపురం నుంచి 19 నమూనాలు ల్యాబ్ కి వెళ్లాయని.. వారిలొ వైద్యులు సహా 13మంది ఆరోగ్య కార్యకర్తలకు జికా వైరస్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నామని వైరాలజీ అధికారులు తెలిపారు.

ఇప్పటికే పాజిటివ్ గా నిర్థారణ అయిన మహిళ గురువారం ఒక బిడ్డకు జన్మనిచ్చిందన్నారు. ఆమె ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోందన్నారు. జ్వరం, తలనొప్పి, ఎర్రటి మచ్చలు వంటి లక్షణాలతో ఆమె జూన్ 28న ఆస్పత్రిలో చేరారు.

ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ఆమె రాష్ట్రం దాటి ఎక్కడికీ ప్రయాణించలదేని.. ఆమె ఇల్లు తమిళనాడు సరిహద్దులో ఉందని అధికారులు చెప్పారు. వారం కిందట ఆమె తల్లిలోనూ ఇవే లక్షణాలు కనిపించినట్లు అధికారులు తెలిపారు. జికా వైరస్ లక్షణాలు కూడా డెంకీ జ్వరం లానే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.