కోవాగ్జిన్ సామర్థ్యం 77శాతం…వారికి కరోనా భయం తగ్గినట్లే..!

కరోనా మహమ్మారి దేశంలో ఎంతలా విజృంభించిందో అందరికీ తెలిసిందే. దీనిని తరిమికొట్టేందుకు అందరూ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. తాజాగా..కోవాగ్జిన్ థ‌ర్డ్ ఫేజ్ ట్ర‌య‌ల్స్ ఫైన‌ల్ రిజ‌ల్ట్ ను కంపెనీ ప్ర‌క‌టించింది.

తీవ్రమైన, మ‌ధ్య‌స్థ కేసుల్లో వ్యాక్సిన్ 77.8శాతం సామర్థ్యాన్ని చూపిందని కంపెనీ ప్ర‌క‌టించింది. తీవ్రమైన కేసుల్లో 93.4శాతం ప్రభావవంతంగా ఉన్నట్లు గుర్తించామంది. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న B.1.617.2 (డెల్టా), B.1.351 (బీటా) వేరియంట్‌లకు వ్యతిరేకంగా 65.2 శాతం సమర్థతను ప్రదర్శించిందని భార‌త్ బ‌యోటెక్ డేటా రిలీజ్ చేసింది.

కోవాగ్జిన్ తీసుకున్న వారిలో క‌రోనా తీవ్ర ల‌క్ష‌ణాలు క‌నిపించ‌వ‌ని, ఆసుప‌త్రిలో చేరాల్సిన అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని త‌గ్గిస్తుంద‌ని భార‌త్ బ‌యోటెక్ తెలిపింది. ఈ మేర‌కు డేటాను మెడ్జివ్ లో ప్ర‌చురించింది. ఇండియాలో జ‌రిగిన అతిపెద్ద థ‌ర్డ్ ఫేజ్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ లో వ్యాక్సిన్ ఫుల్ సేఫ్ అని రుజువైంద‌ని కంపెనీ అధికారికంగా వెల్ల‌డించింది. థ‌ర్డ్ ఫేజ్ లో 25,798 మందిని డోస్-1 లో, 24,419 మందిని డోస్-2లో ప‌ర్య‌వేక్షించామ‌ని… 146 రోజుల పాటు ట్ర‌య‌ల్స్ చేశామ‌ని తెలిపింది.

భార‌త ప్ర‌భుత్వరంగ సంస్థ ఐసీఎంఆర్ స‌హ‌కారంతో ఈ వ్యాక్సిన్ త‌యారు చేసిన‌ట్లు భార‌త్ బ‌యోటెక్ వెల్ల‌డించింది.