ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో భారత్ ముందుంటుంది. మన దేశంలో.. జనాభా నియంత్రణ చాలా అవసరమన్న విషయం కూడా మనందరికీ తెలుసు. అలాంటిది.. ఎక్కువ సంతానం ఉన్నవారికి రూ.లక్ష బహుమతి అందజేస్తామంటూ మిజోరం రాష్ట్రంలో అధికారికంగా ప్రకటన చేయడం విశేషం.
మిజోరం క్రీడాశాఖ మంత్రి రాబర్ట్ రోమవీయా రోయ్‌తే ఈ మేరకు అధికారిక ప్రకటన చేయడం గమనార్హం. మిజో తెగ జనాభాను పెంచేందుకు ఆయన ఇలాంటి ప్రకటన చేయడం గమనార్హం.
తన నియోజకవర్గంలో అత్యధిక సంతానం ఉన్న కుటుంబాల్లో తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరికి రూ. లక్ష రూపాయలను ప్రోత్సాహకంగా ఇస్తానని ఆయన ప్రకటించారు. దేశంలోని అనేక రాష్ట్రాలు జనాభా నియంత్రణకు ప్రాధాన్యం ఇస్తున్న ప్రస్తుత తరుణంలో మంత్రి ప్రకటన సంచలనంగా మారింది. ఫాదర్స్ డే సందర్భంగా మంత్రి రోమవీయా ఈ ప్రకటనను చేశారు.
లబ్ధిదారులు నగదు ప్రోత్సాహకంతో పాటూ ఓ ట్రోఫిని కూడా పొందుతారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఖర్చును మంత్రి తనయుడి ఆధ్వర్యంలో ఉన్న ఓ నిర్మాణ సంస్థ భరిస్తుందని పేర్కొంటున్నారు. వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు సరిపోయే స్థాయిలో మిజోరం జనాభా లేదని మంత్రి అభిప్రాయపడ్డారు. గిరిజనుల్లో.. మిజోలు లాంటి చిన్న తెగల విషయంలో ఇదో పెద్ద సమస్యగా మారిందని.. అందుకే ఇలాంటి ప్రోత్సహాకాలు అవసరమని మంత్రి రాబర్ట్ వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates