కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేస్తోంది. ఈ మహమ్మారి నుంచి దేశాన్ని రక్షించడానికి కేవలం వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కాగా.. ఈ వ్యాక్సిన్ విషయంలో తాజాగా.. ఓ అద్యయనంలో ఆసక్తికర విషయం వెల్లడైంది.
కరోనా నుంచి కోలుకున్న వారికి కేవలం సింగిల్ డోస్ కరోనా టీకా సరిపోతుందట. సింగిల్ డోస్ తోనే వారిలో రోగనిరోధక శక్తి సమకూరుతుందని తాజాగా అధ్యయనంలో తేలింది. హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రి జరపిన అధ్యయనంలో ఈ విషయాలు బయటపడ్డాయి. జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్‌లో ఈ అధ్యయనం తాలూకు వివరాలు ఇటీవలే ప్రచురితమయ్యాయి.
జనవరి, ఫిబ్రవరి నెలల్లో కోవిషీల్డ్ టీకా తీసుకున్న 260 హెల్త్ వర్కర్లలో రోగనిరోధక శక్తి స్థాయిలను అధ్యయనకారులు పరిశీలించి ఈ అంచనాకు వచ్చారు. కొవిడ్ సోకని వారికంటే వ్యాధి నుంచి కోలుకున్న వారిలో టీ, బీ రోగనిరోధక కణాల స్పందనలు అధికంగా ఉన్నాయని వారు గుర్తించారు.
వీరిలో యాంటీబాడీల ఉత్పత్తి కూడా అధికంగానే ఉందని వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్న మూడు నెలల నుంచి ఆరు నెలల లోపల తొలి టీకా డోసు తీసుకంటే..అది రెండు టీకా డోసులకు సమానమైన రోగనిరోధశక్తిని ప్రేరేపిస్తుందని వారు వ్యాఖ్యానించారు. టీకా కొరత కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ అధ్యయనం ప్రజల్లో నెలకొన్న ఆందోళనను కొంత మేర తగ్గించవచ్చని ఏఐజీ ఆస్పత్రి చైర్మన్ డా. నాగేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates