సుప్రీం కోర్టు సంచ‌ల‌న ఆదేశం.. ‘క‌రోనా అనాథ‌ల’ ద‌త్త‌త వ‌ద్దు!

దేశ‌వ్యాప్తంగా క‌రోనా ఫ‌స్ట్ వేవ్ క‌న్నా కూడా సెకండ్ వేవ్‌లో వేలాది మంది మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. అయితే.. ఒకే కుటుంబంలో త‌ల్లిదండ్రులు చ‌నిపోయి.. పిల్ల‌లు మాత్ర‌మే ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డిన ఘ‌ట‌న‌లు అనేకం ఉన్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. క‌రోనాతో త‌ల్లిని, తండ్రిని కోల్పోయి.. అనాథ‌లుగా మిగిలిన చిన్నారుల‌కు రాష్ట్ర‌, కేంద్ర ప్ర‌భుత్వాలు.. బాస‌ట‌గా నిలిచి.. ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

అయితే.. ఇలా అనాథ‌లుగా మారిన వారిని ద‌త్త‌త ఇచ్చేందుకు, తీసుకునేందుకు లేదా ఇలాంటి పిల్ల‌ల‌పై అజ‌మాయిషీ చేసేందుకు.. దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం కొన్ని ష‌ర‌తులు, నిషేధాలు కూడా విధించ‌డం గ‌మ‌నార్హం. తాజాగా సుప్రీం కోర్టు .. దేశంలో క‌రోనా బాధిత కుటుంబాల్లో అనాథ‌లుగా మిగిలిన చిన్నారుల విష‌యంపై విచార‌ణ జ‌రిపింది. ఈ సంద‌ర్భంగా.. అనాథలైన పిల్లలను చట్ట విరుద్ధంగా దత్తత ఇచ్చే, తీసుకొనే ప్రయత్నాలను గట్టిగా అడ్డుకోవాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలను ఆదేశించింది. అలాంటి వ్యక్తులపై, స్వచ్ఛంద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

ఈ మేర‌కు న్యాయ‌మూర్తులు జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వర్‌రావు, జస్టిస్‌ అనిరుధ్‌బోస్‌లతో కూడిన ధర్మాసనం చెప్పింది. కొవిడ్‌ కారణంగా అనాథలైన పిల్లల వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్‌ మీడియాలో గానీ మరోచోట గానీ బయటపెట్టరాదని, ఫలానా పిల్లలను దత్తత తీసుకోవడానికి ముందుకు రావాలని విజ్ఞప్తులు చేయరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు 18 పేజీల మార్గదర్శకాలను విడుదల చేసింది. అనాథ పిల్లల పేర్లను వెల్లడిస్తూ వారి కోసం స్వచ్ఛంద సంస్థలు చందాలు వసూలు చేయరాదని స్పష్టం చేసింది.