Trends

అబ్బో! గీతలో చాలా విషయముందిగా

తెలుగు వారు భగవద్గీతని దేశంలో మిగిలిన ప్రజలకన్నా ఎక్కువగా విన్నారని నా అభిప్రాయం.

ఎందుకంటే ఘంటసాల గారు తెలుగులో అర్థం చెబుతూ పాడడం వల్ల.

వేరే రాష్ట్రాల గాయకులు పాడినా ఘంటసాల భగవద్గీత మన దగ్గర పాపులర్ అయినంతగా మరేదీ ఎక్కడా పాపులర్ కాలేదని నా అంచనా.  

ఏదో విధంగా ఘంటసాల భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు చెవిన పడి పలకరిస్తూనే ఉంటాయి. అది పలకరింపు మాత్రమే అని సరిపెట్టుకోకుండా, ‘పిలుపు’ అనుకుంటే కచ్చితంగా ఆ గ్రంథంలోకి తొంగి చూడాలనే శ్రద్ధ కలుగుతుంది. ఈ మధ్య నాకు అలాగే కలిగింది. ఘంటసాల గారు పాడిన 108 భగవద్గీత శ్లోకాలు ఎన్నో సార్లు విని ఉండడం వల్ల కొన్ని నోటికి వచ్చే ఉంటాయి చాలామందికి..

ఘంటసాల గారు వదిలేసిన శ్లోకాలని కూడా కలుపుకుని 700 శ్లోకాల సమగ్ర భగవద్గీతని కూడా గాయకులు గంగాధర శాస్త్రిగారు రాగయుక్తంగా ఈ మధ్యనే పాడారు. కేవలం తాత్పర్యాలు తెలుసుకుని వదిలేయకుండా ఆ శ్లోకాలని జీవితానికి ఎలా అన్వయం చేసుకోవచ్చు? చేసుకుంటే ఏమొస్తుంది?

ఈ ప్రశ్నల్లో ముఖ్యమైనది ఆఖరిది…”ఏమొస్తుంది?”…

ఈ “ఏమొస్తుంది” అనే ప్రశ్న గురించి ఆలోచించకుండా పని చెయ్యమంటాడు గీతలో కృష్ణుడు. కానీ అది మనకి అంత తేలిగ్గా అర్థం కాదు. ఫలితం గురించి ఆలోచించకుండా పని ఎలా మొదలు పెడతాం? అసలది సాధ్యమా? సాధ్యమైనా ఎందుకు అలా? దీని వెనుక చాలా విషయం ఉంది. “కర్మణ్యేవాధికారస్తే” శ్లోకం గురించి చెప్పుకున్నప్పుడు వివరంగా ఉదాహరణలతో చెప్పుకుందాం.

*
మనిషివి రెండు ప్రపంచాలు- (1) భౌతిక ప్రపంచం, (2) భావనా ప్రపంచం.
భౌతికం అందరిదీ ఒక్కటే. కానీ భావనలు ఎవరివి వాళ్లవే.
ప్రతి ఒక్కరి భావనా ప్రపంచం వారి భౌతిక ప్రపంచాన్ని శాసిస్తుంది.

అందుకే భౌతికంగా అందరికీ రోజుకి 24 గంటలే అయినా..కొందరే వారి వారి రంగాల్లో విశేషమైన విజయం పొందుతారు. మానవాళికి ఏదో ఒక శక్తిని అందిస్తారు. కారణం వారి భావనా ప్రపంచం చాలా బలంగా ఉండడం వల్ల.

భావనా ప్రపంచాన్ని నడిపే ఇంజను మనసు.

కనుక మనసు ఎంత కండిషన్లో ఉంటే భావనాప్రపంచంలో ప్రయాణం అంత హాయిగా, వేగంగా ఉంటుంది. లేకపోతే వేడెక్కిన, బోరుకొచ్చిన ఇంజనుతో ఉన్న కారులో ప్రయాణంలా ఉంటుంది. దాని ప్రభావం భౌతిక జీవితం మీద పడుతుంది.

మనసు లక్షణం కండిషన్ తప్పడం. అలా కండిషన్లో ఉండని మనసుని కండిషన్లో ఉంచుకునే విధంగా సర్వీసింగ్ చేసుకోగలిగే ట్రైనింగ్ మనకి ఇవ్వడమే ఈ భగవద్గీతలో ఉన్న ప్రధాన అంశం.
*

చిన్న ఓటమికే బాధ పడిపోయి ఆత్మహత్యలు చేసుకోవడం,
అయిన దానికి కాని దానికి ఏడవడం,
చేసే పని మీద ఆసక్తి శ్రద్ధ లేకపోవడం,
ఖర్మగాలి ఈ పని చెయ్యాల్సి వస్తోంది అనుకుంటూ పని చేయడం,
ప్రతి దానికి భయపడడం,
పక్కవాడు పైకి వెళ్తుంటే ఓర్వలేకపోవడం,
ఎవరో ఏదో అన్నారని రగిలిపోవడం,
సంపాదన లేదని దిగులు చెందడం,
ఉన్న సంపాదన పోయిందని ఉరేసుకోవడం,
ఎంత సంపాదన ఉన్నా ప్రశాంతత లేకపోవడం….వీటన్నిటికీ మూలం బలహీనపడిన మనసే. దానిని రాటుదేల్చేదే భగవద్గీత.

శరీరానికి వ్యాయామం ఎంత ముఖ్యమో…
మనసుకి భగవద్గీత అంత ముఖ్యం…

గీతాసారాంశాన్ని ఆకళింపుచేసుకుంటే మరే వ్యక్తిత్వవికాస పాఠాల అవసరం ఉండదు. అంత లోతు ఉంది ఇందులో.

సనాతన ధర్మంలో ఉంటున్న చాలా మంది విష్ణుసహస్రనామం, లలితాసహస్రం పారాయణ చేస్తూ ఉంటారు. కానీ భగవద్గీత పారాయణం చేసే వారు కనిపిస్తున్నారా?
వేదాల సారం ఉపనిషత్తులు అయితే, వాటి సారాంశం భగవద్గీత అని ప్రచారం పొందినా ఎందుకు ఈ గ్రంథాన్ని నిత్యపారాయణ చేయరు? కలియుగంలో భగవన్నామం జపిస్తే చాలు అని అన్నారని ఇంకేవీ అక్కర్లేదు అనుకుంటున్నారా? మరణాలప్పుడు వినడం అలవాటైపోయి గీతాపారాయణ ఎప్పుడుపడితే అప్పుడు చేయకూడదు అనుకుంటున్నారా? ఇటువంటి ప్రశ్నలు నన్ను కుదుపుతూనే ఉన్నాయి.

“పుట్టిన వాడికి మరణం తప్పదు- మరణించిన వాడికి జన్మము తప్పదు” అనే శ్లోకం మీద చాలానాళ్లుగా డిబేట్లే విన్నాను. కానీ ఈ సారి ఈ శ్లోకానికి సపోర్టింగ్ గా నాకొక సైంటిఫిక్ రీజన్ తట్టింది. అది నేను ఈ శ్లోకం గురించి చెప్పినప్పుడు చెప్తాను.

అలాగే “ఆత్మ నాశనము లేనిది. దానిని నిప్పు కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఆర్పివేయలేదు..అది ఒక శరీరంలోంచి మరొక శరీరంలోకి వెళ్తుంది” అనే శ్లోకంలో నాకు “లా ఆఫ్ కన్సెర్వేషన్ ఆఫ్ ఎనెర్జీ” సూత్రం కనపడింది. అది కూడా ఈ శ్లోకం వంతు వచ్చినప్పుడు వివరిస్తాను.

భగవద్గీత ఏనాటిదో. కానీ మన కాలంలో ప్రామాణికమైన సైన్స్ సూత్రాల కోణంలోంచి చూస్తే గీతలో కూడా సైన్స్ ఉంది కదా అనిపిస్తుంది. ఎందుకంటే సత్యం అనేది ఎప్పుడూ ఉంటుంది. దానిని ఎప్పుడు తెలుసుకుంటామనేది వేరే విషయం. తెలియనంతవరకూ ఊహ. తెలిసాక సైన్స్.

మహామహా పండితులే భగవద్గీత ఒకసారి చదివితే ఒక అర్థం, మరో సారి చదివితే మరొక గొప్ప అర్థం అందుతుందని చెప్తారు. ఆ వ్యాఖ్యానాలు, భాష్యాలు, వ్యుత్పత్తులు, ఆధ్యాత్మిక పరిభాషల్లోకి వెళ్లకుండా… నాకున్న పరిధిలో రీజనింగ్ తో గీతను అర్థం చేసుకుని అన్వయించుకుంటుంటే కొత్త అనుభూతినిస్తోంది. ఆ అనుభూతులనే ఈ లాక్డౌన్ సమయంలో వ్యాసాలుగా రాసుకుంటున్నాను.

తరచు ఏదో ఒక శ్లోకంతో మీ ముందుకు వస్తాను. నా ఆలోచన మీ ముందు ఉంచుతాను.
 
ప్రస్తుతం ప్రపంచమంతా యుద్ధరంగంగా మారింది.
ఇది మనిషి తనని తాను కాపాడుకోవడానికి కరోనా మీద చేస్తున్న ప్రపంచయుద్ధం.
మనసు పెట్టాలేగానీ ఇప్పుడు భగవద్గీత మరింత గట్టిగా వినిపిస్తుంది.
ఎందుకంటే యుద్ధరంగం గీతకి పుట్టినిల్లు కదా!

  • సిరాశ్రీ

This post was last modified on June 19, 2020 12:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ష‌ర్మిల – మెడిక‌ల్ లీవు రాజ‌కీయాలు ..!

కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు.. వైఎస్ ష‌ర్మిల చేసిన వ్యాఖ్య‌లపై సోష‌ల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. తాజాగా ఆమె మీడియాతో…

40 minutes ago

మీ ఇల్లు – మీ లోకేష్‌: చేతికి మ‌ట్టంట‌ని పాలిటిక్స్ ..!

స‌మాజంలోని ఏ కుటుంబ‌మైనా.. త‌మ‌కు ఓ గూడు కావాల‌ని త‌పిస్తుంది. అయితే.. అంద‌రికీ ఇది సాధ్యం కాక‌పోవ‌చ్చు. పేద‌లు,.. అత్యంత…

2 hours ago

ప్రియాంకా చోప్రాకు అంత సీన్ ఉందా

అసలు బాలీవుడ్ లోనే కనిపించడం మానేసిన సీనియర్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా హఠాత్తుగా టాలీవుడ్ క్రేజీ అవకాశాలు పట్టేస్తుండటం ఆశ్చర్యం…

2 hours ago

పెద్ద నేత‌ల‌కు ఎస‌రు.. రంగంలోకి జ‌గ‌న్ ..!

వైసీపీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఓ మోస్త‌రు నేత‌ల‌ను మాత్ర‌మే టార్గెట్ చేసిన కూట‌మి ప్ర‌భుత్వం.. ఇప్పుడు పెద్ద త‌ల‌కాయ‌ల జోలికి…

3 hours ago

బుచ్చిబాబు మీద రామ్ చరణ్ అభిమానం

ఎంత హీరోలతో పని చేస్తున్నా సరే ఆయా దర్శకులకు అంత సులభంగా వాళ్ళ ప్రేమ, అభిమానం దొరకదు. ఒక్కసారి దాన్ని…

3 hours ago

వావ్…రీ రిలీజ్ కోసం టైం మెషీన్

ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత ఈ రోజు విడుదలవుతున్న ఆదిత్య 369 సరికొత్త హంగులతో థియేటర్లలో అడుగు పెట్టేసింది. ప్రమోషన్ల…

4 hours ago