బ్లాక్‌ఫంగస్ రాకుండా ఉండాలంటే..


బ్లాక్ ఫంగస్.. కొవిడ్ కల్లోల సమయంలో జనాలను కొత్తగా భయపడుతున్న మాట. కొవిడ్ నుంచి కోలుకున్న రోగుల్లో తలెత్తుతున్న ఈ కొత్త సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది. కళ్లు సహా ఒంట్లోని కొన్ని ముఖ్య అవయవాలను దెబ్బ తీయడంతో ప్రాణాలకే ముప్పుగా పరిణమిస్తున్న ఈ జబ్బు జనాల్లో తీవ్ర ఆందోళన పెంచుతోంది. క్రమంగా బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు కంగారు పడిపోతున్నారు. దీన్నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలా అని చూస్తున్నారు. మరి ఈ బ్లాక్ ఫంగస్ లక్షణాలేంటి.. అది సోకితే ఏం చేయాలి.. దీని నివారణకు ఏం చేయాలో ఓసారి చూద్దాం.

మ్యూకోర్మైకోసిస్ అనే సాంకేతిక నామంతో పిలుచుకుంటున్న బ్లాక్ ఫంగస్ కొవిడ్ బారిన పడ్డ షుగర్ పేషెంట్లపై ఎక్కువ ప్రభావం చూపుతోంది. షుగర్ ఉండి కొవిడ్ చికిత్సలో భాగంగా స్టెరాయిడ్లు ఎక్కువ వాడిన వారికి ఇది సోకుతోంది. ఈ వ్యాధి రాకుండా నివారించడానికి వైద్యులు కొన్ని ముఖ్య సూచనలు చేస్తున్నారు. ముందుగా షుగర్ అదుపులో ఉండేలా చూసుకోవాలి. షుగర్ పేషెంట్లు కొవిడ్ బారిన పడితే.. ఆయాసం ఉంటే తప్ప స్టెరాయిడ్స్ వాడకూడదు. కచ్చితంగా వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే స్టెరాయిడ్స్ ఉపయోగించాలి. కొవిడ్ చికిత్సలో వాడే పరికరాలు అపరిశుభ్రంగా ఉండటం.. పేషెంట్లు దుమ్ము పట్టిన వాతావరణంలో ఎక్కువ సమయం గడపడం వల్ల కూడా బ్లాక్ ఫంగస్ సోకుతున్నట్లు గుర్తించారు. అందుకే చికిత్స భాగంగా ఉపయోగించే వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, గొట్టాలు ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని.. బూజు ఉన్న ప్రదేశాలకు కొవిడ్ పేషెంట్లు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఈ జాగ్రత్తలు పాటించడం తప్పితే బ్లాక్ ఫంగస్‌ రాకుండా ముందస్తు చికిత్స అంటూ ఏం లేదు. ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే తర్వాత చికిత్స అవసరమవుతుంది. ముక్కు దిబ్బడ.. అలాగే ముక్కులోనుంచి నలుపు లేదా గోధుమ రంగు స్రావం రావడం.. బుగ్గల దగ్గర నొప్పి, తలనొప్పి, కంటినొప్పి, కళ్ళు వాయడం, చూపు మందగించడం లాంటి లక్షణాలుంటే బ్లాక్ ఫంగస్ బారిన పడ్డట్లు అనుమానించాలి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే ఈఎన్టీ స్పెషలిస్టును కలవాలి. వ్యాధి నిర్ధారణ కోసం సీటీ స్కాన్, ఎంఆర్ఐ పరీక్షలు చేస్తారు. వ్యాధి తీవ్రతను కొన్ని వారాల నుంచి ఆరు నెలల దాకా చికిత్స అవసరమవుతుంది. తీవ్రత ఎక్కువ ఉంటే సర్జరీ చేసి శరీరంలో ఫంగస్ ఉన్న ప్రదేశాల్ని శుభ్రపరుస్తారు. కొన్నిసార్లు ప్రాణాలు కాపాడటం కోసం కళ్లు తీసేయాల్సిన పరిస్థితి కూడా తలెత్తుతుంది.