ఐపీఎల్ ఆగింది.. కానీ కరోనా ఆగలేదు

కరోనా ధాటికి నాలుగు రోజుల కిందట ఇండియన్ ప్రిమియర్ లీగ్ 14వ సీజన్ అర్ధంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. రెండు రోజుల వ్యవధిలో అరడజను దాకా కేసులు వెలుగు చూడటంతో టోర్నీని కొనసాగించే పరిస్థితి లేకపోయింది. ఎంతో సురక్షితం అనుకున్న బయో బబుల్ లోపల కరోనా కేసులు బయటపడటంతో వైరస్ ప్రభావం అంతటితో ఆగదని అర్థం చేసుకుని మరో మార్గం లేక లీగ్‌ను ఆపేసింది బీసీసీఐ.

ఐతే లీగ్ ఆగినా.. ఆటగాళ్లలో చాలామంది వారి వారి స్వస్థలాలకు చేరుకుంటున్నా కరోనా మాత్రం ఆగడం లేదు. తాజాగా టోర్నీలో భాగమైన ఇద్దరు ఆటగాళ్లు కొత్తగా కరోనా పాజిటివ్‌గా తేలారు. ఐపీఎల్-14లో ముందుగా కరోనా కేసులు బయటపడ్డ కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులోనే తాజా కేసులు కూడా నమోదవడం గమనార్హం. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ అయిన ప్రసిద్ధ్ కృష్ణ (కర్ణాటక), వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ టిమ్ సీఫర్ట్ (న్యూజిలాండ్)లకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

ఐపీఎల్ వాయిదా పడ్డాక చివరగా అహ్మదాబాద్‌లో కరోనా పరీక్ష చేయించుకుని స్వస్థలం అయిన బెంగళూరుకు బయల్దేరాడు ప్రసిద్ధ్. ఆ సందర్భంగా అతడికి నెగెటివే వచ్చింది. కానీ విమానంలో ప్రయాణించి ఇంటికి చేరుకున్నాక రెండు రోజులకు కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. ఇక న్యూజిలాండ్ ఆటగాళ్లలో కొంతమంది మాల్దీవులకు వెళ్లి ఆ తర్వాత ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ కోసం లండన్‌కు బయల్దేరే ప్రయత్నంలో ఉండగా.. మరికొంతమంది స్వదేశానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ బృందంలో సీఫర్ట్ కూడా ఒకడు. కాగా ప్రయాణానికి ముందు కరోనా పరీక్షలు నిర్వహించగా అతడికి పాజిటివ్ వచ్చింది.

కరోనా లక్షణాలు కొంచెం ఎక్కువగానే ఉండటంతో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్‌ మైకేల్ హసికి చికిత్స అందించిన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి సీఫర్ట్‌ను తరలించాలని నిర్ణయించారు. అహ్మదాబాద్‌ నుంచి అతణ్ని చెన్నైకి పంపే ప్రయత్నం జరుగుతోంది. కోలుకున్నాక అక్కడి నుంచే అతను న్యూజిలాండ్‌కు వెళ్తాడు. కోల్‌కతా జట్టులో ముందుగా వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా పాజిటివ్‌గా తేలడంతోనే లీగ్ ఆగింది. ఆ తర్వాత మరిన్ని కేసులు బయటపడటంతో టోర్నీని వాయిదా వేశారు.