ఒకేలాంటి సమస్యను పది మందికి ఇస్తే.. ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్టు అవుతారు. సరిగ్గా కరోనా విషయంలోనూ ఇలానే జరిగింది. అక్కడెక్కడో వూహాన్ మహానగరంలో పుట్టిన కంటికి కనిపించని మహమ్మారి.. ప్రపంచం మొత్తాన్ని పాకేసింది. అయితే.. కొన్ని దేశాలు అద్భుతంగా వ్యవహరించి.. ఆ రాకాసి కోరల్ని పీకేసి.. పక్కన పెట్టేయటమే కాదు.. తమ ప్రజలకు ఎలాంటి హాని కలుగకుండా చూసుకున్నాయి. అదే సమయంలో.. మరికొన్ని దేశాలు.. దానికి సమర్థవంతంగా చెక్ పెట్టే విషయంలో అడ్డంగా ఫెయిల్ కావటమే కాదు.. తమ తప్పులకు ప్రజలు మూల్యం చెల్లించేలా చేశాయి. లక్షలాది మంది ప్రాణాలు పోయేలా చేయటమే కాదు.. కోట్లాది మందిని ఆర్థికంగా గుల్ల అయ్యేలా చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనాను అద్భుతంగా ఎదుర్కొన్న ఐదు దేశాలు ఎలానో.. దారుణంగా దెబ్బ తిన్న ఐదు దేశాల జాబితాను సిద్ధం చేశారు. ఇంతకీ.. భారత్ పేరు ఉందా? అన్న సందేహం కలిగిందా? ఇంకెందుకు సమాధానాల కోసం చూద్దాం.
తొలుత కరోనాపై అద్భుతమైన విజయాన్ని సాధించిన ఐదు దేశాలు.. అవేం చేశాయన్న విషయంలోకి వెళితే.. తొలి స్థానం తైవాన్ కు దక్కుతుంది. రెండో స్థానం.. న్యూజిలాండ్ కు.. మూడో స్థానం ఐస్ లాండ్ కు.. నాలుగో స్థానం సింగపూర్ కు.. ఐదో స్థానం వియత్నాంకు దక్కుతుంది. ఎందుకిలా.. ఆ దేశాలు ఏం చేశాయన్న విషయంలోకి వెళితే..
- తైవాన్
కరోనాకు పుట్టినిల్లు అయిన వూహాన్ కు చాలా దగ్గరగా ఉండే దేశం. చైనాకు కేవలం 130 కి.మీ. మాత్రమే దూరంలో ఉన్న ఈ బుజ్జి దేశ జనాభా 2.3కోట్లు. వూహాన్ లో కరోనా విరుచుకుపడుతున్న వైనాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థకు తొలుత హెచ్చరించింది తైవానే. కానీ.. ఆ సంస్థ మాత్రం ఆ దేశం మాట వినలేదు. వైరస్ తమ దేశం మీద విరుచుకుపడకుండా ఉండేందుకు సెంట్రల్ ఎపిడమిక్ కమాండ్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. టెక్నాలజీ సాయంతో.. కోవిడ్ రోగుల్ని ట్రేసింగ్ చేయటం షురూ చేసింది. నమ్మలేని నిజం ఏమంటే.. ఇప్పటివరకు ఆ దేశంలో నమోదైన పాజిటివ్ కేసులు ఎన్నో తెలుసా? అక్షరాల 1153 మాత్రమే. వీరిలోనూ పన్నెండు మంది మాత్రమే మరణించారు.
వైరస్ గురించి సమాచారం బయటకు పొక్కినంతనే అలెర్టు అయిన ఈ దేశం.. వ్యూహాన్ నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణికుల్ని క్వారంటైన్ చేసంది. అనంతరం తమ దేశంలో వెలుగు చూసిన కేసుల్ని సాంకేతికత సాయంతో ట్రేస్ చేసి మూలాల్ని గుర్తించటం.. దానికి చెక్ పెట్టటం ద్వారా.. వైరస్ కోరలు పీకేశారు. జాగ్రత్తలు తీసుకున్నా గత ఏడాది నవంబరు 30న ఒకే రోజు 24 కేసులు నమోదు కావటంతో మరోసారి అలెర్టు అయిన ఆ దేశం.. భారీ ఎత్తున చర్యలు చేపట్టింది. అంతే.. అప్పటి నుంచి ఆ దేశం కరోనాకు దడ పుట్టేలా చేసింది. కరోనాను కంట్రోల్ చేయటంలో ప్రపంచ దేశాలకు తైవాన్ ఆదర్శంగా నిలిచిందని చెప్పక తప్పదు.
- న్యూజిలాండ్
కరోనా తీవ్రతను.. దాని కారణంగా జరిగే నష్టాన్ని సరిగ్గా ఊహించిన దేశాల్లో న్యూజిలాండ్ ఒకటి. వైరస్ కట్టడికి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంది. ఈ కారణంతోనే ఇప్పటివరకు ఆ దేశంలో నమోదైన కేసులు కేవలం 2629 మాత్రమే. మరణాలు కూడా 26కే పరిమితమయ్యేలా చేసింది. వైరస్ వ్యాప్తి సమాచారాన్ని అందుకొని వేగంగా స్పందించిన ఆ దేశం.. గత ఏడాది ఫిబ్రవరిలోనే అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షల్ని విధించింది.
దేశంలో తొలి వంద కేసులు నమోదైన వెంటనే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. ఆర్థిక వ్యవస్థ కంటే కూడా దేశ ప్రజల ప్రాణాలే ముఖ్యమని ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ వాదిస్తారు. ఇప్పటికి కోవిడ్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
- ఐస్ లాండ్
లాక్ డౌన్ విధించకుండా కరోనాను అదుపులోకి తీసుకురావటం సాధ్యమా? అంటే..నో చెబుతారు ఎవరైనా. కానీ.. ఈ దేశం గురించి తెలిస్తే మాత్రం.. అవునని చెప్పాల్సి ఉంటుంది. 3.64 లక్షల జనాభా ఉన్న ఆ దేశంలో ఇప్పటివరకు కేవలం 6491 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. 29 మరణాలే నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తి కాకుండా ఉండేందుకు.. ఎవరైతే పాజిటివ్ అవుతారో.. వారిని వారి ఇంటికే పరిమితం చేయటం.. ఇంట్లోనే వైద్యం చేయటం.. వారు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండేలా చేయటం.. వారికి అవసరమైన ఆర్థిక సాయాన్ని అందించటం లాంటివి చేసి.. కంట్రోల్ చేసింది. - సింగపూర్
మహమ్మారిని సమర్థవంతంగా అడ్డుకోవటంలో ఈ చిన్న దేశం ట్రాక్ రికార్డుకు ఫిదా కావాల్సిందే. టైమ్లీగా స్పందించటం.. పరీక్షలు నిర్వహించటంలో ప్రదర్శించిన దూకుడు.. వైరస్ ను వ్యాపించే వారిని అడ్డుకోవటంలో అనుసరించిన విధానాలు కరోనా వ్యాప్తికి చెక్ పెట్టేలా చేశాయి. సరిహద్దులపై కఠిన ఆంక్షలతో పాటు.. క్వారంటైన్ ను కఠినంగా అమలు చేయటంలోనూ ఆ దేశం సక్సెస్ అయ్యింది. 5.7 మిలియన్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఇప్పటివరకు 61,252 కేసులు నమోదు కాగా.. 31 మంది మరణించారు. ఈ దేశంలో నమోదైన కేసుల్లో 90 శాతం విదేశీ కార్మికుల కారణంగానే చోటు చేసుకున్నాయి. ఇప్పుడు అక్కడ పాజిటివ్ కేసుల సున్నా కావటం గమనార్హం. 2003లో ఆ దేశాన్ని వణికిపోయేలా చేసిన సార్స్ నుంచి పాఠాలు నేర్చుకున్న ప్రభుత్వం.. కరోనా విషయంలో అలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఈ రోజున ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. - వియత్నాం
కోవిడ్ ను సమర్థంగా నిలువరించిన దేశాల్లో ఈ దేశం విజయవంతమైంది. చైనాలో కోవిడ్ వెలుగు చూసినంతనే ఈ దేశ అధికారులు అలెర్టు అయ్యారు. ఈ దేశంలో తొలి కేసు జనవరి 30న నమోదైంది. ఆ వెంటనే.. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షల్ని విధించింది. సరిహద్దు ప్రాంతాల్లో కొవిడ్ పరీక్షల్ని ముమ్మరంగా చేపట్టింది. అప్పటికే స్కూళ్లు మూతపడినప్పటికి.. వారికి సెలవుల్ని మే వరకు పొడిగించారు. విదేశీ పర్యాటకుల్ని వారి దేశాలకు పంపేశారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. ఇలా తీసుకున్న కఠిన చర్యల కారణంగా ఆ దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసులు కేవలం 2995 మాత్రమే.
ఇలా పక్కా ప్లానింగ్ తో.. సమర్థవంతమైన నాయకత్వంతో.. అధికారుల ముందుచూపుతో ఆయా దేశాలు కోవిడ్ ను వియవంతంగా నిలువరించగలిగితే.. అందుకు భిన్నంగా మరికొన్ని దేశాలు ఏ మాత్రం విజన్ లేకుండా.. కరోనాను లైట్ తీసుకోవటం.. తమను తాము పవర్ ఫుల్ గా ఫీలై.. భారీ మూల్యాన్ని చెల్లించారు. అందుకు ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికానే నిదర్శనం.నాటి అధ్యక్షుడు ట్రంప్ విధానాలకు ఆ దేశం భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది. సమర్థవంతమైన నాయకత్వ లేమితో కోవిడ్ తో అవస్థలు పడుతున్న దేశాలు.. మహమ్మారి చేతిలో దారుణ పరాభవం ఎదురైన టాప్ 5 దేశాల విషయానికి వస్తే..
- అమెరికా
- బ్రెజిల్
- భారత్
- మెక్సికో
- బ్రిటన్