ఐపీఎల్ 14వ సీజన్ ఆరంభానికి ముందు కరోనా కలకలం చూసి లీగ్ సవ్యంగా సాగుతుందా లేదా అన్న సందేహాలు కలిగాయి. కొందరు ఆటగాళ్లతో పాటు పెద్ద ఎత్తున నిర్వాహక సిబ్బంది కరోనా బారిన పడటం తెలిసిందే. ఐతే వాళ్లందరూ కోలుకోవడం, కొత్త కేసులు నమోదు కాకపొవడంతో గండం గట్టెక్కినట్లే అనుకున్నారంతా. లీగ్ మొదలయ్యాక అందరూ కరోనా గురించి మరిచిపోయారు. టోర్నీ సాఫీగా సాగిపోతోంది. ఇక ఇలాగే సీజన్ మొత్తం ముగిసిపోతుంది అనుకుంటుండగా.. ఇప్పుడు ఉన్నట్లుండి మళ్లీ లీగ్‌లో వైరస్ కలకలం మొదలైంది.
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాళ్లు ఇద్దరు కరోనా బారిన పడటం లీగ్‌ను కుదిపేస్తోంది. అందులో ఒకరు నైట్‌రైడర్స్ జట్టులో రెగ్యులర్‌గా మ్యాచ్‌లు ఆడుతున్న స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కాగా.. మరొకరు ఫాస్ట్‌బౌలర్ సందీప్ వారియర్. వీళ్లిద్దరూ తమిళనాడుకు చెందిన వాళ్లే కావడం గమనార్హం.
లీగ్‌లో ఉంటున్న ఆటగాళ్లందరూ బయో బబుల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బబుల్లోకి ఇతరులు ఎవరూ రారు. వీళ్లు ఎవరినీ కలవరు. ఈ చైన్ బ్రేక్ కాకుండా చూసుకోవడం ద్వారా వైరస్‌ను నియంత్రిస్తారు. ఐతే బబుల్లో ఉన్న వీళ్లిద్దరూ ఇప్పుడు ఎలా వైరస్ బారిన పడ్డారన్నది ప్రశ్నార్థకం. బహుశా ముంబయి, చెన్నైల్లో తొలి దశ మ్యాచ్‌లు ముగించుకుని ఆటగాళ్లు విమానాల ద్వారా ఢిల్లీ, అహ్మదాబాద్ చేరుకునే క్రమంలో వైరస్ సోకి ఉండొచ్చేమో.
ఏదేమైనా లీగ్ మధ్యలో ఇలా ఇద్దరు ఆటగాళ్లు కరోనా బారిన పడటం టోర్నీ మీద తీవ్ర ప్రభావమే చూపేలా ఉంది. ముందుగా సోమవారం అహ్మదాబాద్‌లో జరగాల్సిన కోల్‌కతా నైట్‌రైడర్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌ను వాయిదా వేశారు. దాన్ని సింగిల్ మ్యాచ్ ఉన్న రోజు మధ్యాహ్నం పూట నిర్వహించే అవకాశాలున్నాయి. లీగ్‌లో మరిన్ని కేసులు నమోదు కాని పక్షంలో మంగళవారం మ్యాచ్ యధావిధిగా నిర్వహించే అవకాశముంది. లేదంటే మాత్రం టోర్నీ భవిష్యత్ ప్రమాదంలో పడటం ఖాయం.