భార‌తీయుల మ‌న‌సు దోచిన ఆసీస్ క్రికెట‌ర్

ఇండియాలో క‌రోనా వైర‌స్ ఉద్ధృతి నేప‌థ్యంలో ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్‌కు కూడా సెగ త‌ప్ప‌ట్లేదు. ఇప్ప‌టికే ఇంగ్లాండ్ ఆట‌గాడు లివింగ్ స్టోన్ క‌రోనాకు భ‌య‌ప‌డి స్వ‌దేశానికి వెళ్లిపోగా.. తన కుటుంబంలో కొంద‌రు క‌రోనాతో పోరాడుతుండ‌టంతో ర‌విచంద్ర‌న్ అశ్విన్ లీగ్ నుంచి త‌ప్పుకున్నాడు. ఇంత‌లోనే ఆస్ట్రేలియా ఆట‌గాళ్లు ఆండ్రూ టై, ఆడ‌మ్ జంపా, కేన్ రిచ‌ర్డ్ స‌న్ సైతం క‌రోనాకు భ‌య‌ప‌డి లీగ్‌కు దూరం అయ్యారు.

క‌రోనా ఉద్ధృతి అంత‌కంత‌కూ పెరుగుతున్న ఈ స‌మ‌యంలో ఐపీఎల్ నిర్వ‌హించ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. కానీ బీసీసీఐ మాత్రం లీగ్ య‌ధావిధిగా కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేసింది. ఐతే ఐపీఎల్‌ గురించి అన్నీ ప్ర‌తికూల వార్త‌లే బ‌య‌టికి వ‌స్తున్న స‌మ‌యంలో.. లీగ్‌లో ఆడుతున్న ఓ ఆట‌గాడు ఓ సానుకూల వార్త‌తో మీడియాలోకి వ‌చ్చాడు.ఆ ఆట‌గాడే ప్యాట్ క‌మిన్స్.

కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ఆట‌గాడైన ప్యాట్ క‌మిన్స్.. ఈ కరోనా క‌ల్లోల స‌మ‌యంలో భార‌తీయుల‌కు త‌న వంతుగా సాయ‌ప‌డాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. కొవిడ్ పేషెంట్లు ఆక్సిజ‌న్ దొర‌క్క అల్లాడుతున్న నేప‌థ్యంలో ఆ దిశ‌గా సాయ‌ప‌డేందుకు 50 వేల డాల‌ర్లు (దాదాపు రూ.37 ల‌క్ష‌లు) విరాళం ప్ర‌క‌టించాడు క‌మిన్స్. ఈ మొత్తాన్ని పీఎం కేర్స్‌కు అత‌ను అంద‌జేశాడు. తాను చేసింది పెద్ద సాయ‌మేమీ కాద‌ని, కానీ ఈ స‌మ‌యంలో భార‌తీయుల‌కు తోడ్పాటు అందించ‌డం త‌న బాధ్య‌త‌గా భావించాన‌ని, మ‌రింత‌ మంది ఈ బాట‌లో న‌డుస్తార‌ని ఆశిస్తున్నాన‌ని క‌మిన్స్ పేర్కొన్నాడు.

రెండేళ్ల కింద‌ట రూ.15.5 కోట్ల‌తో ఐపీఎల్‌లో అత్య‌ధిక ధ‌ర ప‌లికిన ఆట‌గాడిగా నిలిచాడు క‌మిన్స్‌. ఐపీఎల్ ద్వారా ఇంత భారీగా ఆర్జిస్తున్న తాను.. అందులోంచి కొంత మొత్తం భార‌తీయుల‌కు ఇవ్వ‌డానికి ముందుకు రావ‌డం విశేష‌మే. అత‌డి బాట‌లో మ‌రింద‌రు క్రికెట‌ర్లు పయ‌నిస్తారేమో చూడాలి.