ఎస్‌యూవీ అమ్మేసి ప్రాణాలు కాపాడుతున్నాడు


కరోనా కాలంలో ఎందరో మానవతా వాదులు బయటికి వచ్చారు. తమ స్థాయితో సంబంధం లేకుండా సేవా భావాన్ని చాటి హీరోలుగా నిలిచారు. ఏడాది ముందు వరకు ఒక మామూలు నటుడిగా ఉన్న సోనూ సూద్.. కరోనా కాలంలో అద్భుత రీతిలో సేవా కార్యక్రమాలు చేపట్టి రియల్ హీరోగా నిలిచాడు. ఇప్పటికీ తన దాతృత్వాన్ని కొనసాగిస్తున్నాడు. కరోనా బారిన పడ్డప్పటికీ.. రోజూ తనకు వచ్చే వేలాది విజ్ఞప్తులను పరిశీలించి వీలైనంత వరకు తన వల్ల అయిన సాయం చేస్తున్నాడు. సెలబ్రెటీ కాబట్టి ఆయనకు మంచి పేరు కూడా వచ్చింది. ఐతే చాలామంది సామాన్యులు సైతం నిస్వార్థంగా తమ సేవా నిరతిని చాటుతున్నారు. తమ సేవింగ్స్ మొత్తం ఖర్చు చేసి, అలాగే తమకున్న ఆస్తులు అమ్ముకుని కూడా సేవ చేస్తున్న వాళ్లు ఉన్నారు.

హైదరాబాద్‌లో రాము దోసపాటి అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రైస్ ఏటీఎం అని పెట్టి వందలాది మందికి బియ్యం సహా నిత్యావసరాలు అందజేస్తున్నాడు. దాతల సాయానికి, తన డబ్బులు కూడా జోడించి ఏడాదిగా అభాగ్యులను ఆదుకుంటున్నాడు. ముంబయిలో ఇలాంటి ఒక హీరో గురించి మీడియాలో వార్తలు వస్తున్నాయి. తన సేవింగ్స్ మాత్రమే కాదు.. తనెంతో ఇష్టపడి కొనుక్కున్న ఎస్‌యూవీ కారు కూడా అమ్మేసి వేల మంది ప్రాణాలు కాపాడుతున్నాడా వ్యక్తి. అతడి పేరు షాన్వాజ్ షేక్. ముంబయికి చెందిన ఇతను.. గత ఏడాది కరోనా పీక్స్‌కు చేరుకున్న టైంలో ఆక్సిజన్‌తో పాటు మందులు అందక ఇబ్బంది పడుతున్న కొవిడ్ పేషెంట్లను చూసి చలించిపోయాడు.

ఆక్సిజన్ అందక ఎవరూ చనిపోకూడదన్న ఉద్దేశంతో అలాంటి వారికి సాయపడేందుకు నిర్ణయించుకున్నాడు. హెల్ప్ లైన్ పెట్టి ఫోన్ చేసిన వాళ్లందరికీ ఆక్సిజన్ సిలిండర్ పంపడం మొదలుపెట్టాడు. గత ఏఢాది ఇలా దాదాపు 6 వేల మందికి అతను ఆక్సిజన్ సిలిండర్లు అందజేయడం విశేషం. ముందు తన దగ్గరున్న డబ్బులన్నీ ఖర్చు పెట్టిన అతను.. ఒక దశలో నిధులు నిండుకోవడంతో తన ఎస్‌యూవీ కారును అమ్మేశాడు. ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా కోసం ఒక వ్యాన్ ఏర్పాటు చేసుకున్నాడు. ఒకప్పుడు రోజుకు 50-60 కాల్స్ వచ్చేవని.. ఇప్పుడు రోజుకు 500-600 మంది ఫోన్ చేస్తున్నారని.. వీలైనంత మందికి సాయపడే ప్రయత్నం చేస్తున్నానని షేక్ తెలిపాడు. తన వల్ల అయినంత వరకు ఈ సేవను కొనసాగిస్తానని అతను చెప్పాడు. నేషనల్ మీడియా అతడి కష్టాన్ని గుర్తించి కథనాలు ఇస్తోంది.