కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఉదృతి రోజు రోజుకు పెరిగిపోతోంది. ఒకవైపు వైరస్ కేసులు పెరిగిపోతుందటం, మరోవైపు ఆక్సిజన్ అందక రోగులు చనిపోతుండటం అందరిలోను భయాందోళనలు పెరిగిపోతున్నది. నిజానికి కరోనా వైరస్ సోకి చనిపోయే రోగులకన్నా ఆక్సిజన్ అందక చనిపోతున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. ఈ కారణంగానే దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఆక్సిజన్ కు గతంలో ఎప్పుడు లేనంత డిమాండ్ పెరిగిపోతోంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కరోనా సోకిన రోగులందరికీ ఆక్సిజన్ అవసరంలేదు. సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకుని కరోనా సోకిందని తెలియగానే డాక్టర్ల సూచనల మేరకు మందులు వాడితే పెద్దగా సమస్య ఉండదు. కానీ చాలామంది అసలు కరోనా పరీక్షలు చేయించుకోవటంలోనే నిర్లక్ష్యంగా ఉంటున్నారట. పరీక్షలు చేయించుకున్న వారిలో మందులువాడుతున్న వారిసంఖ్య తక్కువగానే ఉంటున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.
పరీక్షలు చేయించుకోక, మందులు వాడకపోవటంతోనే సమస్య పెరిగిపోతున్నదట. సమస్య పెరిగిపోగానే అప్పటికిప్పుడు చాలామంది ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్నారట. అక్కడ రోగులకు సీరియస్ అయిపోయి ఆక్సిజన్ అందని వాళ్ళు చివరి నిముషంలో ప్రభుత్వాసుపత్రులకు వస్తున్నట్లు ఒంగోలు ఆసుపత్రి సూపరెండెంట్ డాక్టర్ శ్రీరాములు తెలిపారు. తమ దగ్గర కూడా ఆక్సిజన్ కొరతగా ఉండటం, చివరి నిముషంలో ఆసుపత్రిలో చేరుతుండటంతో తాము కూడా ఏమీ చేయలేకపోతున్నట్లు చెప్పారు.
నిజానికి కరోనా రోగులకందరికీ ఆక్సిజన్ అవసరం లేదని శ్రీరాములు చెప్పారు. ఆక్సిజన్ లెవల్స్ 94 శాతంకన్నా తగ్గిన వాళ్ళకే ఆక్సిజన్ అవసరమన్నారు. ప్రైవేటు, ప్రభుత్వాసుపత్రుల్లో చేరుతున్న రోగుల్లో 70 శాతంమందికి ఆక్సిజన్ అవసరం అవుతోందట. ఎందుకంటే చివరినిముషంలో ఆసుపత్రుల్లో చేరుతుండటమే ప్రధాన కారణంగా వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వైరస్ వ్యాప్తి చాలా ఎక్కువగా ఉండటం, అప్పటికే అనారోగ్యంతో ఉన్నవారిపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో చాలామందికి ఆక్సిజన్ అవసరం అవుతోందట. కరోనా వైరస్ రోగుల ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో శ్వాస ఆడకపోవటంతోనే ఆక్సిజన్ అవసరం అవుతోందని వైజాగ్ లోని ఆంధ్రా వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పీవీ సుధాకర్ స్పష్టంచేశారు. సకాలంలో పరీక్షలు చేయించుకుని, డాక్టర్ సలహాలు పాటిస్తే చాలామందికి ఆక్సిజన్ అవసరమే ఉండదని సుధాకర్ స్పష్టం చేశారు. మరి ఎంతమంది డాక్టర్ల సూచనలు పాటిస్తున్నారు ?