ప్రపంచంలో ప్రతి 6 కేసుల్లో ఒకటి మనదే!


కరోనా జయించామని జబ్బలు చరుచుకున్నంతసేపు పట్టలేదు.. ఆ ఆనందం ఆవిరి కావటానికి. అసలు.. వడ్డీ మొత్తం కలిపి తీర్చుకున్న చందంగా ఉంది తాజా పరిస్థితి. గత ఏడాది వణికించి.. మన దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసిన కరోనా.. ఇప్పుడు మరోసారి విరుచుకుపడుతోంది. మొదటి దశకు మించిన వేగంతో రెండో దశలో విరుచుకుపడుతున్న ఈ మహమ్మారి.. చెత్త రికార్డుల్ని మన పేరుతో రాసేస్తుంది.

కేవలం వారం వ్యవధిలో తొమ్మిది లక్షలకు పైనే కరోనా కేసుల్ని నమోదు చేయటం.. తాజాగా రోజుకు లక్షన్నరకు పైగా కేసులు నమోదవుతున్న తీరుతో వణుకు పుట్టే పరిస్థితి. మార్చి మొదటి వారం వరకు కొత్త కేసుల నమోదు మామూలుగా ఉన్నా.. ఆ తర్వాత నుంచి రాకెట్ స్పీడ్ తో నమోదవుతున్నాయి. ఏప్రిల్ ఐదు నుంచి పదకొండు మధ్యనున్న ఏడు రోజుల్లో దేశ వ్యాప్తంగా 9.38లక్షల కేసులు నమోదయ్యాయంటే వైరస్ వ్యాప్తి ఎంత తీవ్రంగా ఉందన్నది అర్థం చేసుకోవచ్చు. అంతకు ముందు వారంతో పోలిస్తే.. గత వారం కేసుల సంఖ్య 70 శాతం పెరిగింది.

అంతదాకా ఎందుకు.. ఆదివారం ఒక్క రోజులో లక్షన్నర కేసులు నమోదైతే.. ఈ రోజు (సోమవారం) రోజులో నమోదైన కొత్త కేసులు ఏకంగా 1.69 లక్షలు. అంటే.. రోజు తిరిగేసరికి 19వేల కేసులు ఎక్కువగా నమోదు కావటం అంటే మాటలు కాదు. తాజా గణాంకాలు చూస్తే.. ప్రపంచ వ్యాప్తంగా నమోదయ్యే ప్రతి ఆరు కరోనా కేసుల్లో ఒక కేసు మనదే కావటం గమనార్హం. ఇదంతా చూస్తే.. ఇప్పటికైనా కళ్లు తెరిచి మరిన్ని జాగ్రత్తలు తీసుకోకుంటే.. రానున్న రోజుల్లో ఇలాంటి చెత్త రికార్దులు మరిన్ని మన పేరుతో నమోదు కావటం ఖాయమని చెప్పక తప్పదు.