మరోసారి తన రికార్డును బ్రేక్ చేసిన మన ఉసేన్ బోల్ట్

పరుగు పందెం అన్నంతనే.. అందరికి గుర్తుకు వచ్చేస్తాడు ఉసేన్ బోల్ట్. ప్రపంచంలో వంద మీటర్ల పరుగు పందాన్ని అతి తక్కువ వ్యవధిలో పూర్తి చేసే అథ్లెట్ గా ఆయనకున్న కీర్తి ప్రతిష్ఠల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి బోల్ట్ కు సరితూగే దేశీయ బోల్ట్ గా పిలుచుకునే పరుగుల వీరుడు శ్రీనివాస్ గౌడ. కంబళ పోటీల్లో తొలిసారి ఉసేన్ బోల్ట్ ను మించిన రికార్డును నెలకొల్పి దేశ ప్రజలంతా తన వైపు చూసేలా చేసుకున్నాడు. దీంతో..ఈ కర్ణాటక గ్రామీణ యువకుడి పేరు మారుమోగిపోయింది.

ఇదిలా ఉంటే తాజాగా ఆయన పాల్గొన్న పరుగుల పోటీలో గతంలో తాను నెలకొల్పిన రికార్డును తాజాగా తానే బద్ధలుకొట్టాడు. ఈసారి వంద మీటర్ల దూరాన్ని కేవలం 8.78 సెకన్లలో పూర్తి చేసి కొత్త రికార్డును క్రియేట్ చేశాడు. తాజాగా కర్ణాటకలోని బంత్వాల్ తాలూకా పరిధిలో పరుగుల పోటీని నిర్వహించారు.

125 మీటర్ల పరుగును 11.21 సెకన్లలో పూర్తి చేశాడు. అంటే..100 మీటర్ల ను 8.78 సెకన్లలో పూర్తి చేసినట్లుగా చెప్పాలి. కొద్ది రోజుల క్రితమే తాను నెలకొల్పిన రికార్డును తాజాగా బ్రేక్ చేసి.. కొత్త రికార్డును తన పేరు మీద తిరిగి రాసుకున్నాడు. దీంతో మరోసారి వార్తల్లోకి ఎక్కాడు.