ఊహకు అందని ఉదంతాలు.. దారుణాలు ఇటీవల కాలంలో అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. గతంలోనూ ఇలాంటివి అక్కడక్కడా చోటు చేసుకున్నా పెద్దగా బయటకు వచ్చేవి కావు. సమాచార విప్లవంతో పాటు.. సోషల్ మీడియా కారణంగా ఇప్పుడు ఎక్కడేం జరిగినా.. వెంటనే అందరికి తెలిసిపోయే పరిస్థితి. దీంతో దాచేస్తే దాగని ఉదంతాలెన్నో. తాజాగా అలాంటి షాకింగ్ ఉదంతం పంజాబ్ లో చోటు చేసుకుంది.
ఆ రాష్ట్రంలోని జలంధర్ పట్టణంలో ట్యూషన్ కు వచ్చే పదమూడేళ్ల పిల్లాడ్ని పెళ్లాడిందో టీచర్. ఈ ఉదంతంలోకి వెళితే.. ఇలా కూడా చేస్తారా? అన్న విస్మయానికి గురి కావటం ఖాయం. 28 ఏళ్ల టీచర్ కు ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా.. వర్కువుట్ కావట్లేదు. ఆ యువతి జాతక నక్షత్రంలో మాంగల్య దోషం ఉందని పండితులు తెలిపారు. దీంతో.. ఆమెకు ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా పెళ్లి కావట్లేదు. ఒకవేళ పెళ్లైనా.. కొద్దిరోజులకే భర్త మరణిస్తాడన్న మాటతో హడలిపోతున్నారు.
నిజానికి ఇలాంటి దోషాలు ఉన్న వారికి అరటిచెట్టుతో పెళ్లి జరిపి.. అనంతరం దాన్ని కొట్టేస్తుంటారు. మరి.. ఇలాంటి ఉపాయాలు వేయకుండా.. అతి తెలివితో వేసిన ప్లాన్ ఇప్పుడు అట్టర్ ప్లాప్ కావటమే కాదు.. పోలీసు కేసును ఎదుర్కొంటున్నారు. తన వద్దకు ట్యూషన్ కు వచ్చే బాలుడి మీద కన్నేసిన ఈ టీచర్.. వారి తల్లిదండ్రులకు తమ ఇంట్లోనే వారం పాటు ఉంచుకుంటామని అడిగింది. ట్యూషన్ చెప్పే టీచర్ అడగటంతో.. పిల్లాడి పేరెంట్స్ ఓకే అనేశారు. అక్కడ నుంచి మొదలైంది అసలు కత.
ఈ వారంలో మైనర్ అయిన పిల్లాడ్ని పెళ్లి చేసుకోవటం.. శోభనం లాంటి సంప్రదాయాలతో పాటు.. గాజులు పగుల కొట్టించి విధవను కూడా చేసేశారు. చెప్పినట్లే వారం పూర్తి అయిన వెంటనే ఆ బాలుడ్ని ఇంటికి పంపారు. ఇంటికి వచ్చిన బాలుడు.. వారంలో జరిగిన విశేషాల్ని చెప్పి.. తనను ఏ విధంగా వాడేసింది చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన పిల్లాడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అనంతరం పెద్దల నుంచి ఒత్తిడి..పిల్లాడి తల్లిదండ్రులతో టీచర్ మాట్లాడటంతో కంప్లైంట్ ను వాపస్ తీసుకున్నారు. అయితే.. ఈ విషయం మీడియాలో రావటం సంచలనంగా మారటంతో..జలందర్ డీజీపీ గుర్ మీత్ సింగ్ రంగంలోకి దిగారు. బాలుడు మైనర్ కావటంతో విషయాన్ని సీరియస్ గా తీసుకున్నామని.. సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. పాడు కాలంలో ట్యూషన్ కు పంపేందుకు సైతం తల్లిదండ్రులు వెనకాడాల్సిన దుస్థితి తప్పదన్నట్లుగా ఈ ఉదంతం ఉంది కదా?